రామనగర నుంచి గెలిస్తే సీఎం పదవి ఖాయం

25 Jul, 2019 07:53 IST|Sakshi
పదవీకాలం పూర్తి చేయలేకపోయిన నలుగురు మాజీ ముఖ్యమంత్రులు వీరే

అయితే 5 ఏళ్లు         అధికారం కష్టమే

కర్ణాటక, దొడ్డబళ్లాపురం : రామనగర జిల్లా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఎంత ఖాయమో, వారు ఐదేళ్లు అధికారంలో ఉండలేరనేది అంతే ఖాయమని మరోసారి రుజువయింది. మంగళవారం కుమారస్వామి అధికారం కోల్పోయిక ఈ విషయం మరోసారి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. కెంగల్‌ హనుమంతయ్య, రామక్రిష్ణహెగడె, హెచ్‌డీ దేవెగౌడ, ఇప్పుడు తాజాగా కుమారస్వామి. వీరంతా రామనగర జిల్లా నుండి ఎన్నికయినవారే. కానీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు అధికారావధి పూర్తి చేయలేకపోయారు.

అంతేకాదు రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి రెండుసార్లు కూడా పూర్తి అధికారంలో ఉండలేకపోయారు. మాజీ ముఖ్యమంత్రులయిన కెంగల్‌ హనుమంతయ్య, రామక్రిష్ణహెగడె, హెచ్‌డీ దేవెగౌడ, హెచ్‌డీ కుమారస్వామి వీరంతా రామనగర నుండి ఎన్నికయ్యారు. మొదటిసారి బీజేపీతో జతకట్టి ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి 20 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2018లో కాంగ్రెస్‌తో దోస్తీ చేసి 14 నెలలకే ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్నారు. రామనగర నివాసి అయిన కెంగల్‌ హనుమంతయ్య 1952, 57లో రామనగర నుండే ఎన్నికయ్యారు. ఈయన 4 సంవత్సరాల 5 నెలలు ముఖ్యమంత్రిగా కొనసాగారు. అప్పట్లో సొంత పార్టీ కాంగ్రెస్‌కు చెందిన వారే ఈయనపై అవిశ్వాసం పెట్టారు. రామక్రిష్ణ హెగడె కేవలం 12 నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేవెగౌడ 17 నెలలు ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు. 

మరిన్ని వార్తలు