టీఆర్‌ఎస్‌లో ముసలం

8 Sep, 2018 19:49 IST|Sakshi

తిరుగుబావుటా ఎగరవేస్తున్న అసంతృప్తులు

కాంగ్రెస్‌లోకి వలసల జోరు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడిన వారు తిరుగుబావుటా ఎగరేస్తున్నారు. వరంగల్‌ తూర్పు టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ టీఆర్‌ఎస్‌పై బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో గులాబీ నేత టీఆర్‌ఎస్‌పై తిరుగబాటు చేశారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ టికెట్‌ తనకు కేటాయించకపోవడంతో మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్దమైయ్యారు. ఈ మేరకు శనివారం స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశమైన రాథోడ్‌.. ఖానాపూర్‌లో సీఎం కేసీఆర్‌ పోటీచేసినా.. తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుస్తానాని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన కొడుకు రితీష్‌ రాథోడ్‌ను జోగు రామన్నకు వ్యతిరేకంగా బరిలో నిలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఖానాపూర్‌ టికెట్‌ ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చారని.. ఆ మాట ప్రకారమే తాను  గతంలో టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ఆయన తెలిపారు.

కాంగ్రెస్‌లోకి వలసల జోరు
మరోవైపు రమేష్‌ రాథోడ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్న వార్తలు వస్తున్నాయి. త్వరలో కాంగ్రెస్‌ నేతలతో చర్చించి.. అసెంబ్లీ స్థానంపై క్లారిటీ తీసుకుని హస్తం గూటికి చేరుతారని సమాచారం. దీనిపై స్పందించిన రాథోడ్‌ తన అభిమానులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ అసంతృప్తులను చేరదీసేందుకు కాంగ్రెస్‌ రంగంలోని దిగింది. టీఆర్‌ఎస్‌పై తిరుగుబాటు ఎగరేసిన కొండా దంపతులను పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్‌ దూతలను పంపినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీఎస్‌, ఎమ్మెల్సీ భూపతి రెడ్డి త్వరలో హస్తం గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. బీజేపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు సమరసింహరెడ్డి, నందీశ్వర్‌ గౌడ్‌ శనివారం కమళానికి గుడ్‌బై చెప్పి హస్తంకు చేయందించిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో దగ్గరపడుతున్నకొద్ది మరెంతమంది అసంతృప్త నేతలు కారుదిగుతారోనని టీఆర్‌ఎస్‌ శిబిరంలో ఆందోళన మొదలైంది. 

మరిన్ని వార్తలు