కేసీఆర్‌ బంధువునైనందుకే అన్యాయమా?

4 Nov, 2018 02:09 IST|Sakshi

టీపీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు 

సాక్షి, హైదరాబాద్‌: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీప బంధువునైనందుకే కాంగ్రెస్‌ పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందని టీపీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్యారావు ఆరోపించారు. తాను కేసీఆర్‌ అన్న కుమార్తెనని...అయినప్పటికీ గత ఎన్నికల ముందునుంచీ కాంగ్రెస్‌పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నానని తెలిపారు. పినతండ్రి వద్ద తనకు ఉండే వ్యక్తిగత అనుకూలతలను కూడా పక్కనబెట్టి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నానని..కానీ, తనకు పార్టీ తగిన న్యాయం చేసే పరిస్థితులు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో శనివారం రమ్యారావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేత డీకే అరుణ సోదరుడు రామ్మోహన్‌రెడ్డి, ఆమె సమీప బంధువు కృష్ణమోహన్‌రెడ్డిలను టీఆర్‌ఎస్‌ నమ్మి టికెట్లు ఇచ్చిందని, కానీ, తనను మాత్రం కాంగ్రెస్‌ నమ్మడం లేదని ఆరోపించా రు.  

అరుణ కుటుంబ సభ్యులకు టీఆర్‌ఎస్‌ నేతలు ఇచ్చే గౌరవం కాంగ్రెస్‌లో తనకు దక్కడం లేదని, ప్యారాచూట్లకు టికెట్లు కేటాయించే పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. కేసీఆర్‌ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేదని విమర్శించే కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. పార్టీలో మహిళలనే చిన్నచూపు చూస్తే మహిళల ఓట్లు ఎలా పడతాయన్నారు. గెలిచేవారికే టికెట్లు అంటున్న కాంగ్రెస్‌ నేతలు ఇప్పటివరకూ టికెట్లు ఇచ్చిన వారంతా కచ్చితంగా గెలుస్తారా అని ప్రశ్నించారు. తానేమీ పీసీసీ అధ్యక్ష పదవి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవులు అడగడం లేదని కరీంనగర్, వేములవాడ అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకటి తనకు కేటాయించాలని అధిష్టానాన్ని కోరినట్లు చెప్పారు.  

మరిన్ని వార్తలు