‘ఈ వీడియో బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనం’

28 Jun, 2018 12:32 IST|Sakshi

సర్జికల్‌ స్ట్రైక్స్‌ వీడియో విడుదలపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ నరేంద్ర మోదీ తన ఇమేజ్‌ను పెంచుకునేందుకే సర్జికల్‌ స్ట్రైక్స్‌కు సంబంధించిన వీడియో విడుదల చేశారని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా మాట్లాడుతూ.. సర్జికల్‌​ స్ట్రైక్స్‌ నిర్వహించిన ఘనత భారత సైనికులకు ఇవ్వకుండా బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. రాజకీయంగా లాభపడేందుకే సైనికులకు చెందాల్సిన ఘనత మోదీకి కట్టబెట్టడం వారి అధికార దాహానికి నిదర్శనమన్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఈవిధంగానే సిగ్గు లేకుండా సైనికుల త్యాగాన్ని తమ ఖాతాలో వేసుకుని ఓట్లు సంపాదించాలని చూసిందని విమర్శించారు.

వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే...
మోదీ ప్రభుత్వ వైఫల్యాలు బయట పడినపుడు, అమిత్‌ షా వ్యూహాలు ఫలించని సమయాల్లో ఇటువంటి దిగజారుడు చర్యలకు పాల్పడటం వారికి అలవాటేనంటూ సుర్జేవాలా విమర్శించారు. మెదీ ప్రభుత్వం అసమర్థత వల్లే 146 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. 1600 సార్లు పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం, 79 ఉగ్రదాడులు జరగడం ప్రభుత్వ వైఫల్యం కాక మరేమిటని ప్రశ్నించారు. శత్రువుల దాడులను ఎదుర్కొనేందుకు అధునాతన పరికరాలు కొనుగోలు చేసేందుకు నిధులు అందించలేని మోదీ ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రైక్స్‌ గురించి చెప్పుకోవడం సిగ్గుచేటాన్నరు. మాజీ ప్రధానులు అటల్‌బిహారీ వాజపేయి, మన్మోహన్‌ సింగ్‌లు భద్రతా ప్రమాణాల దృష్ట్యా సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేపట్టారు కానీ తమ గొప్పను ప్రదర్శిచుకోవడానికి వాటిని ఉపయోగించుకోలేదన్నారు. మోదీ, బీజేపీ చేస్తోన్న రాజకీయాలకు బలికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన హెచ్చరించారు.  

కాగా, ఉడీ ఘటనకు ప్రతీకారంగా పాక్‌ అక్రమిత కశ్మీర్‌లోని(పీఓకే) ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్‌ స్ట్రైక్స్‌కు సంబంధించిన వీడియో బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వీడియో నిజమైనదేనని సర్జికల్‌ స్ట్రైక్స్‌కు ఇంచార్జ్‌గా వ్యవహరించిన రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హూడా నిర్ధారించారు.

మరిన్ని వార్తలు