కేసీఆర్‌ అవినీతి చక్రవర్తి : సూర్జేవాల 

24 Nov, 2018 17:53 IST|Sakshi
మాట్లాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాల

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చం‍ద్రశేఖర్‌ రావు అవినీతి చక్రవర్తి అని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాల విమర్శించారు. శనివారం కేసీఆర్‌ ప్రభుత్వం మీద కుంతియా, సూర్జేవాలాలు చార్జీషీట్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సూర్జేవాల మాట్లాడుతూ.. కేసీఆర్‌ హయాంలో అవినీతి, చీటింగ్‌, కుటుంబ పాలన తప్ప మరొకటి లేదన్నారు. తెలంగాణ ప్రజల పట్ల విశ్వాసఘాతకుడిలాగా కేసీఆర్‌ వ్యవహరించాడని పేర్కొన్నారు. అవినీతితో కుటుంబం తప్ప మరో ఆలోచన లేకుండా పాలన సాగిందని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంగతే మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ను అత్యంత అవినీతి ప్రభుత్వంగా గిన్నీస్‌ రికార్డులోకి ఎక్కించవచ్చని దుయ్యబట్టారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెరాస ప్రైవేట్‌ లిమిటెడ్‌గా మారిందన్నారు. ఇసుక మాఫియాలో కోట్లు దోచుకున్నారని, పోలీస్‌ వాహనాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. కేశవరావు 50 ఎకరాల అటవీ భూమిని అక్రమంగా కొన్నారని చెప్పారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు తెరవెనుక చేతులు కలిపాయని అన్నారు. కేసీఆర్‌ను బీజేపీ ఏజెంగా పేర్కొన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తెలంగాణ అమరవీరులకు కేవలం 41కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. మహిళా మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. కేసీఆర్‌ బీసీ ద్రోహి అని.. దళిత సీఎం ఏమయ్యాడని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు