‘కేసీఆర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ను సాగనంపుతాం

25 Nov, 2018 01:54 IST|Sakshi

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా 

ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు 

ప్రజల కలల సాకారానికే కూటమి ఆవిర్భావం 

టీడీపీ మా కూటమిలో ఒక భాగస్వామి మాత్రమే

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ఎన్నో ఉద్యమాలూ, పోరాటాలూ చేశారు. వారి ఆత్మబలిదానాలను చూసి చలించిన యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ, ప్రజల కలలు సాకారం కాకపోగా ఇక్కడ కుటుంబ పాలన నడుస్తోంది. కేసీఆర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని సాగనంపుతాం’అని ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా అన్నారు. త్వరలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. 

దాదాపు 4 దశాబ్దాలుగా మీకు వ్యతిరేకంగా పోరాడిన టీడీపీతో పొత్తుపై ఏమంటారు? 
సూర్జేవాలా: ఈ కూటమిలో ఒక్క టీడీపీనే కాదు, అనేక పార్టీలున్నాయి. కేసీఆర్‌ నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు మాతో కలసి వచ్చిన పార్టీల్లో టీడీపీ కూడా ఒకటి. తెలంగాణకు సరికొత్త దిశానిర్దేశం చేయడానికి, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి, రైతుల సాగునీటి వెతలు తీర్చడానికి, ఆత్మహత్యలకు చరమగీతం పాడటానికి, గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రాంతాన్ని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో మరింత ముందుకు తీసుకెళ్లడానికి కూటమి బాటలు వేస్తుందని విశ్వసిస్తున్నాం.  

ఏపీలోనూ టీడీపీతో పొత్తు కొనసాగుతుందా? 
సూర్జేవాలా: ఏపీలో తెలుగుదేశంతో పొత్తుపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల బరిలో తీవ్రంగా పోరాడుతున్నాం. ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసుకుంటే తెలంగాణ కల సాకారమైంది. కానీ, అమరుల ఆకా>ంక్షలు నెరవేరలేదు. ప్రజల కలలు తీరలేదు. వాటిని నెరవేర్చేందుకే సరికొత్త తెలంగాణ సాధనలో భాగంగా మేం కూటమికి నేతృత్వం వహిస్తున్నాం.  

2018లో మీరు అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తారా? 
సూర్జేవాలా: కాంగ్రెస్‌ పార్టీలో అనేకమంది సీనియర్‌ నేతలు ఉన్నారు. తెలంగాణలో మా విజయం తరువాత ఈ విషయంపై పార్టీలోని నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కానీ, కేసీఆర్‌ దళితుడిని సీఎం చేసి తాను కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితమవుతానని చెప్పారు. అంతే తప్ప, నిమిషంపాటు కూడా ఇతరులకు అధికారమివ్వలేదు.  

గతంలో మీకు ఎంఐఎంతో కలసి పనిచేసిన చరిత్ర ఉంది కదా? 
సూర్జేవాలా: తెలంగాణలో కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఇద్దరూ బీజేపీ ముసుగులే. బీజేపీని ఒకరు ముందుండి, మరొకరు వెనకుండి నడిపిస్తున్నారు. వీరిలో ఎవరికి ఓటేసినా అది బీజేపీకి వేసినట్లే అవుతుంది.  

>
మరిన్ని వార్తలు