నేటి నుంచి ‘రావాలి జగన్‌... కావాలి జగన్‌’

17 Sep, 2018 05:27 IST|Sakshi

సరికొత్త కార్యక్రమానికి సమాయత్తమైన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

ఇంటింటికీ వెళ్లి నవరత్నాలతో జరిగే లబ్ధి గురించి వివరించాలని నిర్ణయం

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయి జనబాహుళ్యానికి చేరువయ్యేందుకు సమాయత్తమయ్యాయి. సోమవారం నుంచి ‘రావాలి జగన్‌... కావాలి జగన్‌’ అనే నినాదంతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాయి. వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను స్వయంగా కలుసుకుంటాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు వారికి వివరించడంతో పాటు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు జరిగే మేళ్లు పార్టీ కార్యకర్తలు వివరిస్తారు. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరించడంతో పాటు, టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వారిని మరింత జాగృతం చేస్తారు. ఇటీవల విశాఖలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమానికి సంబంధించిన దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. వచ్చే నాలుగైదు నెలలు చాలా కీలకమైనందున.. ప్రతీ గడపకు వెళ్లాలని, ప్రజల మనోభీష్టం మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తుందని వివరించాలని ఆయన పార్టీ శ్రేణులకు తెలిపారు. 

ఇదీ కార్యక్రమం...
పాదయాత్ర జరిగే జిల్లాలు మినహా మొత్తం 168 నియోజకవర్గాల్లో ‘రావాలి జగన్‌..కావాలి జగన్‌’ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 17 నుంచి బూత్‌ కమిటీ సభ్యులతో కలిసి నియోజకవర్గ సమన్వయకర్త ప్రతి రోజూ కనీసం రెండు పోలింగ్‌ బూత్‌ల పరిధిలోని ఇళ్లకు వెళ్లి.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ, ఆయా ప్రాంతాల్లోనూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను వివరిస్తారు. వైఎస్సార్‌సీపీ లక్ష్యాలను కూడా చెబుతారు. ఇలా నెల రోజుల్లో 50 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో గల కుటుంబాల్లోని వ్యక్తులందర్నీ కలుస్తారు. నవరత్నాల వల్ల ఏఏ వర్గాలకు ఏడాదికి ఎంత మేర ప్రయోజనం కలుగుతుందో వివరిస్తారు. ఎక్కడైనా ఇంకా బూత్‌ కమిటీల నియామకాలకు జరగకపోతే వాటిని వారం రోజుల్లో పూర్తి చేయాలని పార్టీ అధ్యక్షుడు ఇప్పటికే సూచించారు. అలా నియమించని పక్షంలో పార్టీ కేంద్ర కమిటీయే సమర్థులను గుర్తించి నియామకాలు చేపట్టాలని తీర్మానించారు. బూత్‌ కమిటీల నిర్వహణ తీరును పరిశీలించేందుకు మండల, జిల్లా, రీజినల్‌ స్థాయిల్లో ప్రత్యేకంగా బాధ్యులను నియమిస్తారు. వారు గుర్తించిన విషయాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. 

ఓటర్ల జాబితాపై అప్రమత్తత..
రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గాలి వీస్తున్నందున దానిని అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ అడ్డదారులు తొక్కనుందని ప్రతిపక్షం భావిస్తోంది. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉండే ఓట్లను జాబితా నుంచి తొలగించేందుకు టీడీపీ కుట్ర పన్నిందని, దీన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ వర్గాలు నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలగించిన ఓట్లను సరిచేయడంతో పాటు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయి నుంచి మొదలు పెట్టాలని భావిస్తోంది. ఈ వ్యవహారంలో న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ప్రతీ ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండేలా ప్రజల్ని చైతన్య పర్చేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయనున్నాయి. ఈ వ్యవహారాలపై బూత్‌ కమిటీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నాయి.

వైఎస్సార్‌సీపీ వస్తే ప్రతీ ఒక్కరికీ లక్షల్లో లబ్ధి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అధినేత వైఎస్‌ జగన్‌ సూచించారు. అవినీతి సొమ్ముతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని వైఎస్సార్‌సీపీకి ఉన్న సమాచారం. చంద్రబాబు ఓటుకు ఇచ్చే రూ. 3 వేలు కన్నా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే జరిగే మేళ్లు భారీగా ఉంటాయని పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించానున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారం చేపడితే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకూ ప్రయోజనం చేకూరుతుందనే విషయాన్ని ప్రజలకు పార్టీ శ్రేణులు వివరించనున్నాయి. రైతు భరోసా పేరుతో అందించే ఏడాదికి రూ. 12,500 సాయం, ఉచిత బోర్లు, ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ రుణాలు ఇవన్నీ కలుపుకుంటే రైతన్నకు ఏటా లక్ష వరకూ ప్రయోజనం ఉంటుందని వివరించాలని నిర్ణయించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, అమ్మఒడి పథకం, వైఎస్సార్‌ ఆసరా, పేదలందరికీ ఇల్లు కట్టించే పథకం, పింఛన్ల పెంపు తదితర పథకాల వల్ల జరిగే లబ్ధిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు వివరిస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో రూపొందించిన కరపత్రాలను పార్టీ శ్రేణులు ప్రతీ ఇంటికీ చేర్చనున్నాయి. 

మరిన్ని వార్తలు