కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి సంచలన ఆరోపణలు

25 Jun, 2020 17:09 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సంచలన ఆరోపణలు చేశారు.  కాంగ్రెస్‌ నాయకుల ఆధ్వర్యంలోని రాజీవ్‌ ట్రస్ట్‌కు చైనా ఎంబసీ నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీలోని మేధావులు చైనాకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. చైనాకు కాంగ్రెస్‌ పార్టీకి మధ్య సంబంధాలు ఉన్నాయని.. అక్కడి నుంచి వచ్చే నిధులతోనే ఆ పార్టీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. భారత్‌, చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై అధికార బీజేపీపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ  నేపథ్యంలో కేంద్ర మంత్రులు కాంగ్రెస్‌కు ధీటుగా బదులిస్తున్నారు. (చదవండి : ఆ రాజవంశం ప్రతిపక్షంతో సమానం కాదు)

మరోవైపు ఎమర్జెన్సీకి సంబంధించి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్‌ పార్టీలపై రవిశంకర్‌ ప్రసాద్‌ పలు విమర్శలు చేశారు. ‘1975 జూన్‌ 25 అప్పటి  కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రధాని సీటును కాపాడుకోవడానికే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ కాలంలో జయప్రకాశ్‌ నారాయణ్‌, అటల్‌బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, చంద్రశేఖర్‌ వంటి ప్రముఖ నాయకులతో పాటు లక్షలాది మంది ప్రజలు అరెస్ట్‌ అయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత 1977 జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పారు. కేంద్రంలో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక ప్రవర్తనకు వ్యతిరేకంగా భారత ప్రజలు చేసిన త్యాగాలను గుర్తుచేసుకునే రోజు ఇది. వారి వారసత్వం ఇప్పటికీ కొనసాగుతోంది. జయప్రకాశ్‌ నారాయణ్‌ సారథ్యంలో బిహార్‌ నుంచి ఓ కార్యకర్తగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం నా అదృష్టం’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు