‘కాంగ్రెస్‌ పార్టీ తీరు సిగ్గుచేటు’

22 Jun, 2018 16:31 IST|Sakshi
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ (పాత ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్‌లో సైనిక, పారా మిలటరీ దళాలు ఉగ్రవాదుల కంటే అమాయక ప్రజలనే ఎక్కువగా చంపుతున్నాయంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తప్పుపట్టారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యలను లష్కర్‌-ఎ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు సమర్థించడం సిగ్గుచేటన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జాతిని విడదీయాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తారిఖ్‌ హమీద్‌ వంటి పాకిస్తానీ వకాల్తాదార్లను పార్టీలోకి ఆహ్వానించడంలో కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశమేమిటో అర్థం కావడం లేదని వాఖ్యానించారు.

కాగా, కాంగ్రెస్‌ పార్టీ తారిఖ్‌ హమీద్‌ను చేర్చుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఆజాద్‌, సోజ్‌లతో పాటు ప్రస్తుతం మరో పాకిస్తానీ ప్రతినిధి(వకాల్తాదారు) హమీద్‌కు కాంగ్రెస్‌ పార్టీలో సరైన స్థానం లభించింది. పాకిస్తానీ భాష మాట్లాడే మిస్టర్‌ హమీద్‌ కర్రా.. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీల సమక్షంలో ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరారంటూ’ బీజేపీ ట్వీట్‌ చేసింది.

మరిన్ని వార్తలు