దయచేసి వారి సలహా తీసుకోండి..

1 Jan, 2020 20:00 IST|Sakshi

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేయకుండా ఏ ఒక్కరాష్ట్రం తప్పించుకోలేదని కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమైన సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయనివ్వబోమంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సహా పలు రాష్ట్రాల సీఎంలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఏఏను ఎత్తివేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది.

ఈ క్రమంలో బుధవారం మీడియాతో మాట్లాడిన రవిశంకర్‌ ప్రసాద్‌... ‘ ఓటు బ్యాంకు రాజకీయాలతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సీఏఏను అమలు చేయనివ్వమంటూ బాహాటంగా ప్రకటనలు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. వారందరికీ నేనిచ్చే మర్యాదపూర్వక సలహా ఒకటే. దయచేసి మీరంతా న్యాయ నిపుణులు అభిప్రాయం తీసుకోండి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 245, 256 సహా ఇతర అధికరణల ప్రకారం పౌరసత్వానికి సంబంధించిన చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఆర్టికల్‌ 256 ప్రకారం కేంద్రం తీసుకువచ్చిన చట్టాలతో విభేదించకూడదని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియదా’అని ప్రశ్నించారు. 

అదే విధంగా.. ‘ మీరు ఆచరిస్తున్న ప్రక్రియ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం. ఉభయ సభల్లో చర్చించి ఆమోదం పొందిన తర్వాత.. రాష్ట్రపతి సంతకంతో పౌరసత్వ సవరణ బిల్లు చట్టరూపం దాల్చింది. కాబట్టి ఈ చట్టాన్ని అమలు చేయకుండా ఎవరూ అడ్డుకోలేరు. ప్రజాప్రతినిధులుగా పదవీ స్వీకార ప్రమాణం చేసినపుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామన్న మాటలను మరోసారి గుర్తుచేసుకోండి అని రవిశంకర్‌ ప్రసాద్‌ హితవు పలికారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా