ఎస్టీల గొడవను పరిష్కరించరే?

15 Dec, 2017 03:29 IST|Sakshi

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఎస్టీల్లోని ఆదివాసీలు, లంబాడీల మధ్య గొడవను ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడం లేదని మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌ ప్రశ్నించారు. గాంధీభవన్‌లో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడుతూ.. లంబాడీలతో తమకు నష్టం జరుగు తోందని ఆదివాసీలు, గోండులు, కోయలు అపోహతో మాట్లాడుతున్నారన్నారు. రిజర్వేషన్లలో లంబాడీలు, ఆదివాసీల మధ్య పోరు తీవ్రం కాకముందే ఈ గొడవను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు.

ఇది శాంతిభద్రతల సమస్యగా మారకముందే సీఎం, గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి గిరిజనుల మధ్య గొడవను ప్రభుత్వం పెంచి పోషిస్తోందని ఆరోపించారు. గిరిజనుల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్టీలకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌ మామ, సీఎం కేసీఆర్‌ వియ్యంకుడు ఎస్టీ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని రవీంద్రనాయక్‌ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు