వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే మెట్టు

13 Mar, 2019 18:27 IST|Sakshi

హైదరాబాద్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో  రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత మెట్టు గోవింద రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లో ఆయనకు వైఎస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మెట్టు గోవింద రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉన్న 30 మంది ఎమ్మెల్యేల్లో తానూ ఒకడినని, ఆ తర్వాత కూడా పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్సీగా గెలిచి పార్టీ కోసం పనిచేశానని తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో లేకున్నా టీడీపీని కాపాడుకున్నామని, కానీ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కనీసం ఒక్కసారి కూడా సీఎం చంద్రబాబును కలిసే అవకాశం దక్కలేదని వాపోయారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇంచార్జిగా ఉండి రాయదుర్గం నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ తీరుతో విసిగి వేసారి టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరామన్నారు.  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలి.. జగన్‌ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరానని, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏ బాధ్యత ఇచ్చినా కష్టపడతానని చెప్పారు. 

జగన్‌ మీద నమ్మకంతోనే: కాపు
ఎలాంటి షరతులు లేకుండా గోవింద రెడ్డి పార్టీలో చేరడం శుభాపరిణామమని, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలనే ఉద్దేశ్యంతోనే గోవిందరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారని రాయదుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి చెప్పారు. ఈసారి వైఎస్‌ జగన్‌ కచ్చితంగా సీఎం అయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీలు, మతాలకు అతీతంగా వైఎస్‌ జగన్‌ మీద నమ్మకంతో పార్టీలో చేరుతున్నారని అన్నారు.
 

మరిన్ని వార్తలు