సీఎంతో భేటీ అనంతరం నిర్ణయం: రాయపాటి

2 Feb, 2018 19:29 IST|Sakshi
నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు

ఢిల్లీలో ఎంపీలను  హీనంగా చూస్తున్నారు..

ఏపీకి అన్యాయం చేస్తే కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి కూడా

గుంటూరు : బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరగిందని,కేంద్ర ప్రభుత్వంపై యుద్ధంలో మూడంచెల వ్యూహాన్ని సిద్ధం చేశామని సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌కు ఆ పార్టీకి చెందిన మరో సీనియర్‌ ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా జత కలిశారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ..ఏపీకి జరిగిన అన్యాయంపై తాను రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆదివారం సమావేశం అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ ఏది చెబితే కేంద్రం అదే చేసే పరిస్థితిలో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీలకు ఎంతో విలువ ఉండేదని, కానీ బీజేపీ ప్రభుత్వంలో ఢిల్లీలో ఎంపీలను హీనంగా చూస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేస్తే కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి కూడా పడుతుందని శాపనార్ధాలు పెట్టారు.

బీజేపీపై ప్రజలలో తీవ్ర ఆగ్రహం ఉందని, బీజేపితో కలసి ఉండాలా,  వద్దా అనేది ఆదివారం సీఎంతో భేటీ తర్వాత తేలుతుందని వ్యాఖ్యానించారు. రాజీనామాల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఓ పక్కన చెబుతూ ఉంటే టీడీపీ ఎంపీలు మాత్రం పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ పొగరు దించుతామని, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి చంద్రబాబు నాయకత్వం వహిస్తారని, శుక్రవారం అమరావతిలో టీడీపీ సమన్వయ సమావేశం జరుగుతున్న సమయంలోనే టీడీపీ రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేశ్‌ ఈ రోజు ఉదయమే ఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. 

మరిన్ని వార్తలు