ప్రభుత్వాన్ని ఎందుకు రద్దుచేస్తారు?

26 Aug, 2018 03:54 IST|Sakshi

 తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి

కేసీఆర్‌ను డిమాండ్‌ చేసిన కుంతియా

సాక్షి, న్యూఢిల్లీ: ఐదేళ్లు పాలించమని టీఆర్‌ఎస్‌ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే, ప్రభుత్వాన్ని ముందుగానే ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో సీఎం కేసీఆర్‌ చెప్పా లని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌ అసలు ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. ఆరు సర్వేల్లోను టీఆర్‌ఎస్‌కు సానుకూల ఫలితాలు వచ్చాయని చెబుతున్న కేసీఆర్‌ ఇక ముందస్తుకు వెళ్లడం దేనికని ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న భయం ఆయనలో నెలకొందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధంగా ఉన్నామని, ముందస్తు ఎన్నికలు జరిగినా, సాధారణ ఎన్నికలు జరి గినా విజయం తమదే అన్ని ధీమా వ్యక్తం చేశారు. ఇక పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కొత్తగా ఏర్పాటు చేసిన కోర్, మేని ఫెస్టో, ప్రచార కమిటీల్లో తెలంగాణ నేతలకు ప్రాతినిథ్యం లేకపోవడంపై మీడియా ప్రశ్నించగా.. ఈ కమిటీలను రాష్ట్రాలవారీగా ఏర్పాటు చేయలేదని, ఈ కమిటీల్లో స్థానం లేని వారికి ఇతర కమిటీల్లో స్థానం కల్పిస్తామని కుంతియా తెలిపారు.

సెప్టెంబర్‌ రెండో వారంలో తొలి జాబితా
కాంగ్రెస్‌ పార్టీ కూడా ముందస్తు ఎన్నికలకు సమాయత్తమవుతోంది. అభ్యర్థుల ప్రకటన మొదలు క్షేత్రస్థాయిలో కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వరగా రూపొందిస్తామని ఏఐసీసీ వర్గాలు తెలిపా యి. సెప్టెంబర్‌ రెండో వారంలో 60 మందితో కూడి న తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు సమాచారం. పార్టీకి అనుకూలత, పోటీలేని నియోజకవర్గాల్లో మొదట అభ్యర్థులను ప్రకటించనుంది.

ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు చెప్పించుకొని జాబితా విడుదల చేస్తామని తెలిపాయి. రాష్ట్ర స్థాయిలో ప్రచా ర, మేనిఫెస్టో కమిటీలు, కొత్త జిల్లాల వారీగా కమిటీ ఏర్పాటు తుది దశకు వచ్చిందని, వీటి ఆమోదంపై రాహుల్‌ గాంధీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని చెప్పాయి. కుటుంబం నుంచి ఒక్కరికే టిక్కెట్టు ఇవ్వాలన్న సిద్ధాంతాన్ని రాష్ట్రంలో అనుసరించబోదని.. బలమైన అభ్యర్థులు ఉంటే కుటుంబానికి 2 టికెట్లు ఇస్తామని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు