సవాల్‌కు సై: విజయసాయిరెడ్డి

27 Mar, 2018 14:37 IST|Sakshi

టీడీపీ ఆరోపణలపై చర్చకు సిద్ధం

సీఎం రమేశ్ పెద్ద దొంగ.. సుజనా ఆర్థిక నేరగాడు..

సీసీ ఫుటేజీల్లో టీడీపీ ఎంపీల బాగోతం

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానితో భేటీ అంశాంలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ విసిరిన సవాలును స్వీకరిస్తున్నానని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ అని, చర్చల కోసం దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చినా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. మంగళవారం పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు సంచలన అంశాలు వెల్లడించారు.

సీసీటీవీ ఫుటేజీలో టీడీపీ బాగోతం: ‘ప్రజా సమస్యల గురించి ప్రధానిని కలిస్తే నన్ను విమర్శిస్తున్న టీడీపీ నేతలు.. ఇవాళ రాజ్యసభలో జరిగినదానికి ఏం సమాధానం చెబుతారు? ఒకవైపు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇంకోవైపు ప్రధాని మోదీతో, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో వీళ్లు ఏం మంతనాలు చేస్తున్నారు? ఏకంగా జైట్లీ కాళ్లు మొక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజ్యసభ సీసీటీవీ ఫుటేజీల్లో టీడీపీ ఎంపీల బాగోతమంతా రికార్డైంది. ఆ ఫుటేజీని సర్టిఫై చేయించి, సెక్రటరీ సంతకంతో బయటపెడితే టీడీపీ గుట్టు రట్టవుతుంది’ అని విజయసాయిరెడ్డి అన్నారు.

సీఎం ఓ దొంగ.. సుజనా దెబ్బకి బ్యాంకులు దివాలా: ‘‘నాలుగైదు రోజుల్లో సీఎం రమేశ్‌ బండారాన్ని బయటపెడతాం. ఉత్తరాఖండ్‌లో పనులు చేయకుండా బిల్లులు తీసుకున్నాడు. సుజనా చౌదరి బ్యాంకులను మోసం చేశాడు. ఆయన దెబ్బకి త్వరలో కొన్ని బ్యాంకులు దివాలా తీయబోతున్నాయి. ఇలాంటి దొంగలా మాపై విమర్శలు చేసేది? ఇవాళ రాజ్యసభలో టీడీపీ ఎంపీలు జైట్లీతో ఏం మాట్లాడారో వెల్లడించే దమ్ముందా?’’అని విజయసాయి ప్రశ్నించారు.

చంద్రబాబు ఓ చార్లెస్‌ శోభరాజ్‌: అందితే జుట్టు, లేకపోతే కాళ్లు పట్టుకోవడం చంద్రబాబుతోపాటు టీడీపీ నాయకుల నైజమని విజయసాయి అన్నారు. ‘‘చంద్రబాబూ.. మీరో చార్లెస్‌ శోభరాజ్‌. మీ అంత దుర్మార్గపు నాయకుడు ఈ దేశంలోనే లేరు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హత మీకు లేనేలేదు’ అని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు