బెంగళూర్‌ పోరులో రియల్టర్లదే హవా

4 May, 2018 15:57 IST|Sakshi

సాక్షి, బెంగళూర్‌ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూర్‌ నగరం రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. నగర రాజకీయాలను రియల్‌ ఎస్టేట్‌ లాబీ ప్రభావితం చేస్తుందనేది బహిరంగ రహస్యమే. అందుకు తగ్గట్టే ప్రధాన రాజకీయ పార్టీలు రియల్టర్ల ధనబలానికి తలొగ్గి పెద్దసంఖ్యలో వారికి టిక్కెట్లను కట్టబెట్టాయి. బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌లు పోటాపోటీగా సంపన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు సంచీలకే పార్టీలు మొగ్గుచూపాయనే విమర్శలు వినిపించాయి.

బెంగళూర్‌ అర్బన్‌ జిల్లాలోని 28 నియోజకవర్గాల్లో మూడు ప్రధాన పార్టీలు బరిలో దింపిన మొత్తం 82 మంది అభ్యర్థుల్లో కేవలం ఏడుగురు మాత్రమే రూ కోటిలోపు ఆస్తులు కలిగిఉండగా, మిగిలిన వారంతా కోటీశ్వరులే. వారిలో 13 మంది రూ 100 కోట్ల పైబడిన నికర ఆస్తులు కలిగిఉండటం గమనార్హం. గోవిందరాజనగర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్యెల్యే ప్రియా కృష్ణ రూ 1020 కోట్ల ఆస్తులతో రాష్ట్రంలోనే అత్యంత సంపన్న అభ్యర్థి. ఆయన మూడవసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీచేస్తుండగా, ఆయన తండ్రి లేఅవుట్‌ కృష్ణప్పగా పేరొందిన ఎం కృష్ణప్ప విజయనగర్‌ నుంచి మరోసారి బరిలో ఉన్నారు. ఈయన ఆస్తులు రూ 235 కోట్లు కావడం గమనార్హం.

కాంగ్రెస్‌ తరపున బరిలో ఉన్న ఈ తండ్రీకొడుకులు ఇద్దరూ రియల్‌ ఎస్టేట్‌ రంగానికి చెందిన వారే.  ఇక బీజేపీ నుంచి అత్యంత సంపన్న అభ్యర్థులైన నందీష్‌ రెడ్డి, గరుడాచార్‌లు ఇద్దరూ వరుసగా రూ 303, రూ 190 కోట్ల ఆస్తులు కలిగిఉన్నారు. కేఆర్‌ పురం, చిక్‌పేట్‌ నుంచి పోటీలో ఉన్న వీరిద్దరూ బిల్డర్లే. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బసవనగుడి నుంచి పోటీచేస్తున్న రియల్టర్‌ కే బాగేగౌడ రూ 320 కోట్ల ఆస్తులు కలిగిఉన్నారు. మూడు ప్రధాన పార్టీల్లో జేడీఎస్‌కు చెందిన షేక్‌ మస్తాన్‌ అలి కేవలం రూ 10.45 లక్షలతో పేద అభ్యర్థిగా నిలిచారు.

మరిన్ని వార్తలు