జగన్‌ ప్రభంజనం ఇలా..

23 May, 2019 17:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం. ఓదార్పు యాత్ర అయినా.. పాదయాత్ర అయినా ప్రజల కోసం ఏందాకైనా ముందుకు సాగే ధీరత్వం.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆఖండ విజయాన్ని అందించాయి. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలన్న ఆరాటం.. చంద్రబాబు పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఫలితాల్లో ప్రతిబింబించింది. సుమారు 10 శాతం ఓట్ల వ్యత్యాసంతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం అసాధారణం. ఇంతటి భారీ ఆదరణ సాధించడానికి జననేత జగన్‌కు అనేక అంశాలు కలసి వచ్చాయి.

ఒక్క చాన్స్ ఇవ్వాలనుకోవడం..
తన సువర్ణ పాలనలో తమ జీవితాల్లో వెలుగులు నింపిన దివంగత మహానేత రాజశేఖర్‌ రెడ్డి తనయుడిగా తమ మధ్యకు వచ్చి, కష్ట సుఖాలతో మమేకమైన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలనుకున్నారు. జగన్‌ వస్తేనే తమ జీవితాలు మారుతాయని గట్టిగా నమ్మారు. ఆ విశ్వాసంతోనే అధికార పార్టీ ఎన్నికల ముందు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా.. ఇప్పటి వరకు చంద్రబాబుకు చాన్సిచ్చాం.. ఒక్కసారి జగన్‌కు ఇద్దామనే దృఢ సంకల్పంతో అండగా నిలిచారు. ఆ సరళి ఓటింగ్‌లో స్పష్టంగా కనిపించింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ ఇదే ట్రెండ్ ప్రతిబింబించింది.

పాదయాత్ర-నవరత్నాలు
వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3,648 కిలోమీటర్లు సాగించిన సుదీర్ఘపాదయాత్రతో ఆయన ప్రజలకు మరింత చేరువయ్యారు. చంద్రబాబు అరాచక పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను కళ్లారా చూశారు.. విన్నారు. నేనున్నానే భరోసా కల్పించారు. సంక్షేమంలో వైఎస్సార్‌ది ప్రత్యేకమైన సంతకం. ఆ మహానేతలాంటి సువర్ణ పాలనను అందిస్తానని, సంక్షేమ పథకాలు అమలు చేస్తానని జగన్ హామీలు ఇచ్చారు. అందరికంటే ముందే నవరత్నాల పేరిట ఓ భారీ మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. డ్వాక్రా రుణాలు మాఫీ, పిల్లలు స్కూళ్లకు వెళ్తే నగదు, వృద్ధులకు రూ.3 వేల పెన్షన్, ఉచితంగా ఇళ్లులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ నవరత్నాలను ప్రతి ఒక్కరి మనసుల్లో పాతుకుపోయేలా చేశారు. ప్రజలు కూడా నవరత్నాలతో తమ జీవితాలు మారుతాయని విశ్వసించారు. జగన్‌ ఇచ్చిన భరోసాతో ఆయనకు అండగా నిలిచారు. అఖండ విజయాన్ని అందించారు.

ప్రత్యేక హోదాపై పోరాటం..
ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకహోదా అంశం సజీవంగా ఉందంటే దానికి కారణం వైఎస్‌ జగనే.  హోదాపై చంద్రబాబు నాయుడు పదేపదే యూటర్న్‌ తీసుకున్నా.. జగన్‌ మాత్రం తన పోరాటాన్ని అవిశ్రాంతంగా కొనసాగించారు. హోదానే తమ ప్రధాన ఎజెండాగా చెబుతూ.. ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. సొంత పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి కేంద్ర ప్రభుత్వంపై చివరి అస్త్రాన్ని ప్రయోగించారు.  హోదా ఎవరిస్తే వారికే మా మద్దతు ఉంటుందని కుండబద్దలు కొట్టారు. ఆ త్యాగం లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. పార్లమెంట్ సభ్యులు కూడా ఏకపక్షంగా గెలవడమే దీనికి సంకేతం. 

వైఎస్‌పై తరగని ఆదరణ..
వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న ఆదరణ ఏమాత్రం తరగలేదు. ఇది జగన్‌ అఖండ విజయానికి కలసి వచ్చింది. ఆయన పథకాలను గుర్తు చేయడానికి యాత్ర లాంటి సినిమాలు విడుదల కావడం కూడా ఉపయోగపడింది. 

టీడీపీపై వ్యతిరే‍కత
ఇక ప్రజల్లో టీడీపీపై ఉ‍న్న తీవ్ర వ్యతిరేకత ఫలితాల్లో​ స్పష్టంగా కనిపించింది. ఈ వ్యతిరేకతను టీడీపీనేతలు పసిగట్టపోయినప్పటికి వైఎస్సార్‌సీపీ నేతలు మాత్రం గుర్తించారు. దానికి తగ్గట్టు రాజకీయ వ్యూహాలను అమలు చేశారు. ముఖ్యంగా జన్మభూమికమిటీలతో గ్రామాల్లో ప్రజల చాలా విసిగిపోయారు. ఇదే అంశాన్ని తమ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. అంతేకాకుండా.. భూదోపిడీ, ఇసుక మాఫియా, అగ్రిగోల్డ్‌, హత్యారాజకీయాలు, చంద్రబాబు అబద్ధపు వాగ్ధానాలను ప్రజలకు వివరిస్తూ వారిని మేలుకొల్పారు. ఇక చివర్లో పార్టీ చేరికలు ప్రజల్లో ఓ వేవ్‌ను తీసుకొచ్చాయి. సీట్ల కేటాయింపులో కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రణాళిక బద్దంగా ముందుకు సాగడంతో అనితర సాధ్యమైన విజయాన్ని నమోదు చేశారు.

మరిన్ని వార్తలు