ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ సీట్లు: అఖిలేశ్‌

23 Apr, 2019 01:32 IST|Sakshi

లక్నో: ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లొస్తాయని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ‘బీజేపీ, కాంగ్రెస్‌ల కన్నా ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ సీట్లొస్తాయనుకుంటున్నాను. తదుపరి ప్రధాని ప్రాంతీయ పార్టీల నుంచే అవుతారు’ అని ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని రేసులో మీరున్నారా? అని అడిగిన ప్రశ్నకు బదులుగా ‘నేను ప్రధాని రేసులో లేను. కానీ తర్వాతి పీఎం ఉత్తర ప్రదేశ్‌ నుంచే అయితే నేను సంతోషిస్తా. ప్రధాని అభ్యర్థికి నా పూర్తి మద్దతుంటుంది’ అని అన్నారు. ఒక వేళ ఎస్పీ–బీఎస్పీ కూటమి ప్రియాంక గాంధీ వాద్రాకు మద్దతునిస్తే అన్న ప్రశ్నకు ‘మా కూటమి బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీతోనే ఉంటుంది. వారణాసి నుంచి పోటీకి మా అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం’ అని తేల్చి చెప్పారు. బీజేపీ–కాంగ్రెస్‌ మధ్య రహస్య కూటమి ఉందని ఆయన ఆరోపించారు. అలాగే ఇటీవల యోగి ఆదిత్యనాథ్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘ఎవరికైనా గర్వం ఎక్కువ కాలం కొనసాగదు. ఈసారి రాష్ట్ర ప్రజలు ఆయనకు తగిన సమాధానం చెప్తారు’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు