దశలవారీగా లాక్‌డౌన్‌ సడలింపు

14 Apr, 2020 09:03 IST|Sakshi

ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ సూచన

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 కారణంగా దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని, స్థూల జాతీయోత్పత్తిలో కనీసం ఐదారు శాతం మొత్తానికి తక్కువ కాకుండా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కోరింది. కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా కేంద్రం తన బకాయిలు మొత్తాన్ని రాష్ట్రాలకు వెంటనే చెల్లించాలని, దీంతోపాటు ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ వాణిజ్యశాఖ మంత్రి ఆనంద్‌ శర్మ సోమవారం డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా సీఎం రిలీఫ్‌ ఫండ్స్‌కు కూడా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధులు, పరిశ్రమల నుంచి వచ్చే విరాళాలు ఇచ్చేందుకు అనుమతించాలని, లేదంటే అది రాష్ట్రాల పట్ల వివక్ష చూపినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. పీఎం కేర్స్‌ ఫండ్‌ను నేషనల్‌ రిలీఫ్‌ ఫండ్‌గా మార్చాలని ఆయన డిమాండ్‌ చేశారు.

‘ఇప్పుడు అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాబట్టి తీసుకునే చర్యలు కూడా అలాగే ఉండాలి. అందుకే ప్రధాని ఆర్థిక ప్యాకేజీ విషయంలో ఉదారంగా వ్యవహరించాలి. లాక్‌డౌన్‌ అనంతర ఆర్థిక వ్యవస్థలోని వేర్వేరు రంగాలు మళ్లీ జీవం పుసుకునేందుకు సాయం చేయాలి’ అని వీడియో ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో ఆనంద్‌ శర్మ పేర్కొన్నారు. యునైటెడ్‌ కింగ్‌డమ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తిలో పదిహేన శాతం మొత్తాలను ప్యాకేజీలుగా ప్రకటించాయని, అమెరికా పది శాతం మొత్తాన్ని ఖర్చు చేయనుందని గుర్తు చేశారు. ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి అంశాల గురించి పట్టించుకోకుండా ప్రభుత్వం కనీసం 5 –6 శాతం జీడీపీ మొత్తాన్ని ఖర్చు చేయాలని అన్నారు.

లాక్‌డౌన్‌ ప్రకటన ఆకస్మికంగా జరిగిందని, ఎత్తివేత సమయంలో రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలని సూచించారు. లాక్‌డౌన్‌ను దశలవారీగా సడలించి, ఆర్థిక వ్యవస్థకు ఊరట కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఫార్మా, బీమా, ఆర్థిక రంగాల్లోని కంపెనీలను విదేశీ కంపెనీలు తమ వశం చేసుకోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ దిశగా సెబీ, ఆర్‌బీఐలు తగిన చర్యలు తీసుకునేలా కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని కోరారు.  

చదవండి: పీఎం కేర్స్‌పై పిల్‌ కొట్టివేత 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు