వీళ్లు ఆయనకు వారసులా?..ఖర్మ!

1 May, 2018 08:31 IST|Sakshi
ప్రధాని నరేంద్ర మోదీ.. పక్కన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి

సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, త్రిపుర సీఎం విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ల వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. విచిత్రమైన వ్యాఖ్యలతో బీజేపీ ముఖ్యమంత్రులిద్దరూ వార్తల్లో నిలిచింది తెలిసిందే. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ వీరి వ్యాఖ్యలపై మండిపడుతోంది. తాజాగా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి  వీళ్ల వ్యవహారంపై స్పందించారు. 

‘ఒకయాన(విజయ్‌ రూపానీ) గూగుల్‌ను-నారదుడ్ని పోలుస్తూ మాట్లాడతారు. ఆయన జ్ఞానం ఇంతేనేమో. ఇంకోకరేమో(విప్లవ్‌) మహాభారత కాలంలో ఇంటర్నెట్‌ ఉందంటాడు. ఆయన అక్కడితోనే ఆగలేదు. యువకులను ఉద్దేశించి ‘ఉద్యోగాలేం చేస్తారు.. పాన్‌ షాపులు పెట్టుకుని బతకండి’ అంటాడు. మరోసారి అందాల పోటీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తాడు. వాళ్లిద్దరి మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. మోదీగారి వారసులు ఇలా ఉన్నారు. వీళ్లేం ముఖ్యమంత్రులు. వీళ్లా ప్రజల్ని పాలించేంది?. జనాలకు వీళ్లసలు ఏం చెప్పదల్చుకున్నారు. ఇది ఇంతటితోనే ఆగుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు’ అని రేణుకా చౌదరి తెలిపారు. సోమవారం సాయంత్రం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె పై వ్యాఖ్యలు చేశారు. 

ఇదిలా ఉంటే విప్లవ్‌ కుమార్‌ దేవ్‌కు అధిష్టానం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసిందన్నది తెలిసిందే. అయితే ఆ వార్తలను విప్లవ్‌ తోసిపుచ్చారు. ‘మోదీ నన్ను కొడుకులా భావిస్తారు. ఆయన నాపై ఆగ్రహంగా ఉన్నారన్నది నిజం కాదు. చాలా కాలం క్రితమే ప్రధాని అపాయింట్‌మెంట్‌ తీసుకున్నా. అది ఇప్పుడు కుదరటంతో వెళ్లి కలవబోతున్నా’ విప్లవ్‌ వివరణ ఇచ్చుకున్నారు.

మరిన్ని వార్తలు