విశ్వసనీయతకు ప్రతిరూపం జగన్‌ 

2 Apr, 2019 07:46 IST|Sakshi

సాక్షి, అనంతతపురం :  గ్రూప్‌–1 అధికారిగా పనిచేస్తున్న ఆయనకు జీవితం సాఫీగా సాగిపోయేది. రూ.1.80 లక్షల దాకా జీతం. తనకు ఇంతటి అవకాశమిచ్చిన సమాజానికి ఏదైనా చేయాలనే లక్ష్యంతో అప్పుడప్పుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో సేవాతత్పరతను చాటుకునేవారు. అయితే ఏదో అసంతృప్తి. సమాజానికి ఇంకా ఏదో చేయాలనే ఆకాంక్ష ఆయనను కుదురుగా ఉండనీయలేదు. రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత దగ్గరగా ఉండి సేవచేయొచ్చని భావించారు.

కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో చర్చించి ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనే గ్రూప్‌–1 అధికారి తలారి రంగయ్య. అనంతపురం పార్లమెంటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి. జిల్లావాసులకు ఆయన పీడీ రంగయ్యగా సుపరిచితుడు. పీడీ ఇంటిపేరు కాకపోయినా జిల్లాలో డీఆర్డీఏ పీడీగా పని చేసినంత కాలం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి విశేషకృషి చేశారు.

దీంతో ఆయన పీడీ రంగయ్యగానే ఎక్కువ గుర్తింపు పొందారు. ఇంకా 13 ఏళ్ల సర్వీస్‌ ఉన్నా గ్రూప్‌–1 ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి రావడానికి కారణాలేంటి? ఆయనకు స్ఫూర్తిగా నిలిచిందెవరు? అన్న అంశాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. తలారి రంగయ్య అంతరంగం ఆయన మాటల్లోనే..   

ప్రజాసేవ చేయాలనే ఆకాంక్ష జగన్‌తోనే సాధించగలను 
‘‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మనసు చూశా. వయసు చూశా. ఆయనకు పొద్దు వస్తోంది. చంద్రబాబుకు పొద్దు తిరిగింది. వైఎస్‌ జగన్‌ వెంట నడిస్తే మరో 40 ఏళ్ల భవిష్యత్తు ఉంటుంది. ఇన్నేళ్లుగా నేను అనుకున్నది సాధించే వీలుంటుంది. అదే చంద్రబాబు కీలకమైన ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి సాధించిందేమీ లేదు. రాజధాని నిర్మించలేదు. పోలవరం పూర్తిచేయలేదు. ప్రత్యేకహోదా తీసుకురాలేకపోయారు.

ఆంధ్రపదేశ్‌ ఏర్పడినప్పటి నుంచి విడిపోయే దాకా రూ.96 వేల కోట్ల అప్పులుంటే ఈరోజు రూ. 2.50 లక్షల కోట్లకు చేరింది. ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. అదంతా అభివృద్ధి కోసమే ఖర్చుపెట్టామని ఆర్థికమంత్రి చెపుతున్నారు. మరి ఎక్కడ అభివృద్ధి చేశారో అర్థంకావడం లేదు. ఇవి ప్రమాదకరమైన ధోరణులు. వీటిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. సమాజం గురించి బాధ్యతగా ఆలోచించేవారు ఈ ప్రమాదకర ధోరణుల్ని గుర్తించి ప్రశ్నించాలి. వారిలో నేనొకడిని.   

కష్టాలతో కాపురం చేశా.. 
నేను చిన్నప్పటి నుంచి కష్టాలు, ఇబ్బందులతో కలిసి కాపురం చేశాను. బడుగు, బలహీన వర్గాల కష్టాలు ఎలాగుంటాయో తెలుసు. ఆర్థికంగా టీడీపీ అభ్యర్థి జేసీ కుటుంబంతో నేను సరితూగకపోయినా జగనన్న వెంట ఉన్న జనబలం నాకుంది. కరవుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లా ఇక్కట్లపై పార్టీతో కలిసి నా శక్తివంచన లేకుండా జాతీయ స్థాయిలో పోరాడతాను.

ఎంపీగా గెలిస్తే జిల్లాను సస్యశ్యామలంగా మార్చేందుకు నా శాయశక్తులా కృషిచేస్తాను. జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల సమస్యల్ని అతి దగ్గర నుంచి చూసిన నేను వారికి అన్ని విధాలా సాయపడాలనే దృఢసంకల్పంతో ఉన్నాను. వారి సంక్షేమం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ తరఫున పార్లమెంటులో పోరాడతాను.   

ఇది మార్పునకు నాంది
విశ్వసనీయత, విలువలు, వ్యవస్థలో మార్పు అనే పదాలు వైఎస్‌ జగన్‌ నోట ఎçప్పుడూ వస్తుంటాయి. అందులో భాగంగానే రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అట్టడుగు వర్గాల వారిని ఆదరించారు. ఎంపీ టికెట్లు రావాలంటే చిన్న విషయమా.? అందులోనూ ఇలాంటి జిల్లాల్లో బీసీ కులాలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వాలంటే మాటలా.? ఇతర పార్టీలు ఎప్పుడైనా ఈ విధంగా ఇచ్చాయా.? కనీసం ఆలోచనైనా చేశాయా.? వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్పునకు నాంది పలుకుతున్నారనేందుకు ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు కేటాయింపే నిదర్శనం.  

బీసీలంతా జగన్‌కు మద్దతుగా ఉన్నారు 
అత్యంత సామాన్యుడిని, బలహీన వర్గానికి చెందిన నాకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టిక్కెట్‌ ఇచ్చారు. బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలంతా వైఎస్‌ జగన్‌కు మద్దతు చెబుతున్నారు. కచ్చితంగా విజయం సాధించి వైఎస్‌ జగన్‌కు గిఫ్ట్‌గా ఇస్తాం.                     

బీసీ డిక్లరేషన్‌తో తన చిత్తశుద్ధి చాటుకున్నారు 
పార్లమెంటు, అసెంబ్లీ సీట్ల కేటాయింపులో బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యతనిచ్చారు. ఆయన ఎప్పుడూ చెప్పే ‘విశ్వసనీయత’ అనే పదానికి సీట్ల కేటాయింపుతో విలువ పెంచారు. పాలన, పదవులు, రాజ్యాధికారంలో బడుగు, బలహీనులకు సమాన అవకాశాలు ఇవ్వాలని 150 ఏళ్ల కిందటే జ్యోతిరావు పూలే చెప్పారు. ఆయన ఆలోచనల్ని తర్వాతి తరాల్లో అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్, పెరియార్‌ తదితరులు పునరుద్ఘాటించారు.

ఆ సిద్ధాంతాలను ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీలు అవలంభించలేదు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి బీసీల పట్ల తన చిత్తశుద్ధి చాటుకున్నారు. తాము అధికారంలోకి వస్తే నామినేటెడ్‌ పదవులు, పనుల్లో సగం బడుగు, బలహీన వర్గాలకు ఇస్తానని ప్రకటించారు. అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు పదవుల్లోకి రావాలని కోరుకున్నారు.

41 అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇచ్చారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆరు ఎంపీ సీట్లు ఉంటే అందులో మూడు బీసీలకు కేటాయించారు. అంతకంటే ఏం కావాలి. బీసీలు చట్టసభల్లోకి రావాలనే లక్ష్యంతోనే  మాలాంటి సామాన్యులకు సీట్లు కేటాయించారు.    

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?