రిపబ్లిక్‌ టీవీ సర్వే: లోకసభ ఎన్నికల్లో కారు జోరు..

24 Jan, 2019 21:11 IST|Sakshi

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయ దుందుభి మోగించనుందని రిపబ్లిక్‌-సీ ఓటర్‌ సర్వే తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను టీఆర్‌ఎస్‌ 16 స్థానాలు, ఎంఐఎం ఒక్క స్థానం సాధిస్తాయని సర్వే స్పష్టం చేసింది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్‌ టీవీ వెల్లడించింది. గత కొంతకాలంగా సీఎం కేసీఆర్‌ కూడా లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 16 స్థానాలు సాధిస్తుందని చెబుతున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 19 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌.. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదని సీ ఓటర్‌ సర్వే అంచనా వేసింది. బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా తెలంగాణలో తమ ఖాతాను తెరవవని సర్వే పేర్కొంది.

ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే.. టీఆర్‌ఎస్‌ 42.4 శాతం, కాంగ్రెస్‌ 29 శాతం, బీజేపీ 12.7 శాతం, ఎంఐఎం 7.7 శాతం, ఇతరులు 8.2 శాతం ఓట్లు సాధిస్తాయని పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో సర్వే వివరాలు వెల్లడించిన సీ-ఓటర్‌ సంస్థ.. టీఆర్‌ఎస్‌ 9 స్థానాల్లో, కాంగ్రెస్‌ 6 స్థానాల్లో గెలుపొందుతాయని తెలిపింది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించిన అనంతరం పరిస్థితుల్లో భారీ మార్పు వచ్చినట్టుగా తెలుస్తోంది. కాగా, 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 11, కాంగ్రెస్‌ 2 స్థానాలు సాధించిన సంగతి తెలిసిందే.   

మరిన్ని వార్తలు