మోదీ జీ.. చేతులెత్తి వేడుకుంటున్నా!

22 Dec, 2019 18:28 IST|Sakshi

పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కితీసుకోండి

పట్నా: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసనలు, ఆందోళనలతో దేశం అట్టుడుకిపోతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పలువురు పౌరులు సైతం ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది. ఆందోళకారులు నిరసనలకు బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ దిగిరాక తప్పలేదు. ఎన్‌ఆర్సీని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయిన్పటికీ నిరసనలు ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. మరింత ఉధృతంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా ప్రధాని నరేంద్ర మోదీకి శాంతి సందేశం ఇచ్చారు.

ఆదివారం పట్నాలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘చేతులెత్తి వేడుకుంటున్నా దయచేసి సీఏఏను వెనక్కితీసుకోండి. పౌరసత్వ చట్టం భారత దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తోంది. భారత ప్రజల మధ్య విద్వేషాలకు దారితీస్తోంది. ప్రజల ఆగ్రహావేశాలను పరిగణలోకి తీసుకుని చట్టాన్ని వెనక్కి తీసుకోండి. శాంతి మార్గాన్ని ఎంచుకున్న మహాత్మకు కానుకగా ఇవ్వండి.. చరిత్రలో నిలిచిపోతారు’ అని విజ్ఞప్తి చేశారు. కాగా పౌరసత్వ సవరణ చట్టం, దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలుకు వ్యతిరేకంగా బిహార్‌లో ఆర్జేడీ పిలుపు మేరకు శనివారం బంద్‌ జరిగిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు