బీజేపీ మంత్రుల రాజీనామా

9 Mar, 2018 02:08 IST|Sakshi

ముఖ్యమంత్రికి సమర్పించిన కామినేని, మాణిక్యాలరావు

ఆమోదించిన గవర్నర్‌

సాక్షి, అమరావతి: బీజేపీకి చెందిన మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీని వాస్‌లు గురువారం మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఉదయం అసెంబ్లీలో సీఎంను కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆమోదించేందుకు భేటీ అయిన మంత్రివర్గ సమావేశానికి ఇరువురు మంత్రు లు హాజరు కాలేదు.

తర్వాత సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విష్ణుకుమార్‌రాజు, సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ, పీవీఎన్‌ మాధవ్‌లతో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ఇరువురు నేతలు తమ రాజీనామా లేఖలను సమర్పించారు. వీరి రాజీనామాలను ఆమోదించాలని సీఎం చేసిన సిఫార్సును గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించారు. కొంత మంది రాజకీయాల్లో ఎంట్రీ చాలా బాగుంటుంది కానీ ఎగ్జిట్‌ బాధగా ఉంటుందని మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు.

మంత్రి పదవికి రాజీనామా సమర్పించిన అనంతరం కామినేని అసెంబ్లీలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చోటు చేసుకున్న పరిణామాలతో విధిలేని పరిస్థితుల్లో మంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలోనూ, తర్వాత కూడా వెంకయ్యనాయుడును చాలామంది ద్రోహిగా చిత్రీకరించడం బాధగా ఉందని పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. వెంకయ్యనాయుడు రాష్ట్రానికి ఎంతో చేశారని, దేశంలోనే ఎక్కువ గ్రామాలు తిరిగిన ఘనత ఆయనదని, అలాంటి వ్యక్తిని కూడా ద్రోహిగా పేర్కొనడం దారుణమన్నారు.  

మరిన్ని వార్తలు