కాంగ్రెస్‌లో రాజీనామాలు షురూ

16 Nov, 2018 01:28 IST|Sakshi

పార్టీకి గుడ్‌బై చెప్పిన పటోళ్ల కార్తీక్‌రెడ్డి, అరుణతార

రాజేంద్రనగర్‌ స్థానం టీడీపీకి ఇవ్వడంపై కార్తీక్‌రెడ్డి మనస్తాపం

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమి సీట్ల సర్దుబాటు నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఎగసిన అసంతృప్తి జ్వాలలు మరింత తీవ్రమయ్యాయి. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నా రు. వికారాబాద్‌ టికెట్‌ దక్కకపోవడంతో ఇప్పటికే మాజీ మంత్రి చంద్రశేఖర్‌ రాజీనామా చేయగా.. రాజేంద్రనగర్‌ టికెట్‌ ఇవ్వనందుకు నిరసనగా పార్టీ ని వీడుతున్నట్టు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్‌రెడ్డి ప్రకటించారు.

రాజేం ద్రనగర్‌ స్థానాన్ని టీడీపీకి ఇవ్వడంపై మనస్తాపానికి గురైన కార్తీక్‌.. శంషాబాద్‌లో నియోజకవర్గ కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో  గురువారం సమావేశమయ్యారు. అనంతరం కార్యకర్తల అభీష్టం మేరకు పార్టీ ప్రాథమి క సభ్యత్వానికి, ప్రచార కమిటీ సభ్యత్వానికి రాజీ నామా చేస్తున్నానని తెలిపారు. తనతోపాటు నియోజకవర్గంలోని ప్రతీ కార్యకర్త రాజీనామా చేస్తున్నారని చెప్పారు.

సీఎం కేసీఆర్‌తో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ కుమ్మక్కై టీడీపీకి సీట్లు కేటాయిస్తున్నారన్నారు.టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకాష్‌గౌడ్‌ ఇచ్చిన నోట్లకు రమణ అమ్ముడుపోయారని తీవ్ర ఆరోప ణలు చేశారు. కాగా, కార్తీక్‌రెడ్డి ఇప్పటికే రాజేంద్రనగర్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

అరుణదీ అదే దారి...
జుక్కల్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే అరుణతార నిజామాబాద్‌ జిల్లా మహిళా అధ్యక్ష పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిం చారు. గురువారం ఆమె కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రజాసేవ చేసేవారిని కాదని డబ్బుకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేవారికి అధిష్టానం టికెట్‌ ఇస్తోందని ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థిగా జుక్కల్‌ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.

మరోవైపు కాంగ్రెస్‌ టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పీసీసీ అధికార ప్రతినిధి ఎడమకంటి రోశిరెడ్డి ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం ఓ ప్రకట నలో పేర్కొన్నారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్‌ గురువారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దేవరకొండ నుంచి టికెట్‌ ఆశించినప్పటికీ అది దక్కే అవకాశం లేకపోవడంతో ఆయన పార్టీ మారుతున్న ట్లు వెల్లడించారు.

మహబూబ్‌నగర్‌ టికెట్‌ దక్కకపోవడంతో పీసీసీ కార్యదర్శి ఎం.సురేందర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసి ఎన్‌సీపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. వీరితో పాటే కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న క్యామ మల్లేశ్, భిక్షపతి యాదవ్, నాయిని రాజేందర్‌రెడ్డి, నందికంటి శ్రీధర్‌ తదితరులు తదుపరి కార్యాచరణపై కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు