పవన్‌ కల్యాణ్‌.. కేసీఆర్‌ దోపిడి గురించి తెలుసుకో!

2 Jan, 2018 13:07 IST|Sakshi

24 గంటల విద్యుత్‌ ఓ డ్రామా.. దానికి కూడా పొగడ్తలా : కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌ : 24 గంటల విద్యుత్‌ అనేదే ఓ డ్రామా దానికి ఇంకా పొగడ్తాలా అని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. కేసీఆర్‌ అవినీతి గురించి తెలుసుకోవాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు రేవంత్‌ రెడ్డి సూచించారు. మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన కేసీఆర్‌తో పవన్‌ కళ్యాణ్‌ భేటి కావడంపై స్పందించారు. కేసీఆర్‌ 24 గంటల కరెంటు ఇవ్వడంపై పవన్‌ కళ్యాణ్‌ అభినందించడాన్ని రేవంత్‌ తప్పుబట్టారు. తెలంగాణ విద్యుత్‌ కేటాయింపుల గురించి పూర్తిగా తెలుసుకోవాలని హితవు పలికారు. ఉద్యమ సమయంలో విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్‌ రఘు రాసిన పుస్తకం చదివితే  వాస్తవాలు తెలుస్తాయన్నారు. పవన్‌ కళ్యాణ్‌కు తనకు ఉన్న కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా ఈ పుస్తకాన్ని పంపిస్తానని రేవంత్‌ తెలిపారు. కేసీఆర్‌ మాయలో పడొద్దని ఆయన పవన్‌కు సూచించారు.  కేసీఆర్‌ అవినీతికి పవన్‌ కళ్యాణ్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేసుకునే ప్రయత్నం జరుగుతోందని, ఇది గుర్తించాలని పవన్‌ను రేవంత్‌ కోరారు.  

కేసీఆర్‌ కష్టం ఏమిలేదు..
24 గంటలు ఇవ్వడంలో కేసీఆర్‌ కష్టం ఏమి లేదని రేవంత్‌ స్పష్టం చేశారు.  కాంగ్రెస్‌ హయాంలో 2040 మెగవాట్ల కరెంటు ఉత్పత్తయ్యే పనులను ప్రారంభించడం, కేంద్ర ప్రభుత్వం ఉదయ్‌ కింద రాష్ట్రానికి విద్యుత్‌ కేటాయింపులు జరుపడం, దేశవ్యాప్తంగా విద్యుత్‌ మిగులుండటంతోనే ఇది సాధ్యమైందన్నారు.రాష్ట్ర విభజనానంతరం జనాభా ప్రాతిపాదికంగా కాకుండా వినియోగం ప్రకారం విద్యుత్‌ కేటాయింపులు జరగడం కేసీఆర్‌కు కలిసొచ్చిందన్నారు.

24 గంటల కరెంట్‌ దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతుందన్నారు. 24 గంటల కరెంట్‌ వల్ల తెలంగాణ రైతంగానికి ఎలాంటి లాభం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 లక్షల 54 వేల రైతులుండగా.. ఒక ఎకరా నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు 90 శాతం ఉన్నారని పేర్కొన్నారు. గతంలో రాత్రిపూట కరెంట్‌ ఇవ్వడాన్ని తప్పుబట్టిన టీఆర్ఎస్‌ ఇప్పుడెందుకు అలా చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు 24 గంటల అవసరం లేదని, పగటిపూట 9 గంటలు ఇస్తే సరిపోతుందన్నారు. ప్రయివేట్‌ కంపెనీల నుంచి వేల కోట్ల ముడుపులు తీసుకోవడం కోసమే కేసీఆర్‌ ఈ నాటకానికి తెర లేపారని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు