మెట్రోలో కేసీఆర్ అవినీతి పై విచారణ జరపాలి..

29 Mar, 2018 16:12 IST|Sakshi
రేవంత్‌ రెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుపై కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ ఆస్తులు పెంచుకోవడానికి తెలంగాణ రాలేదన్నారు. గతంలో మెట్రో ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేసింది, సుల్తాన్‌ బజార్‌లో డిజైన్‌ మార్చాలన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. పురాతన సంపద పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక పాత డిజైన్‌కే కేసీఆర్‌ ఎందుకు ఓకే చెప్పారో సమాధానం చెప్పాలన్నారు.

ప్రభుత్వ వాటాను అమ్మేందుకు కుట్ర
‘హైటెక్స్‌లో 52  ఎకరాలు, డెలాయిట్‌ బిల్డింగ్‌, విజయవాడలో ఎయిర్‌పోర్ట్‌ ముందు 31 ఎకరాలు, వైజాగ్‌లో 2 ఎకరాల భూములను, హైటెక్స్‌ బిల్డింగ్‌లో 15 వేల స్వ్కేర్‌ ఫీట్‌ని ఎల్‌ అండ్‌ టీ నుంచి కేసీఆర్‌ బినామీలు సొంతం చేసుకున్నారు. 1200 కోట్ల ఆస్తులు ఎల్‌ అండ్‌ టీ నుంచి బినామీ కంపెనీకి బదలాయింపు జరిగాకే పాత మెట్రో డిజైన్‌కు కేసీఆర్‌ ఓకే చెప్పారు. కేసీఆర్‌ ధన దాహంతో మెట్రోలోని ప్రభుత్వ వాటాలను కూడా అమ్మేందుకు కుట్ర జరుగుతుంది. ఆయన కుటుంబం ఎల్‌ అండ్‌ టీ ఆస్తులను బలవంతగా రాయించుకున్నది వాస్తవం. హెచ్‌ఎండీ ఆస్తులను అమ్మి మైహోం జూపల్లి కోసం రాయదుర్గం మెట్రోను నిర్మించాల్సిన అవసరం ఏముంది. నా ఆరోపణలపై స్పందించకుండా తేలు కుట్టిన దొంగల్లా మౌనంగా ఉన్నారు. స్పందిస్తే నిజాలు బయటపడతాయనే సీఎం, మంత్రులు మాట్లాడటం లేదు. తప్పుడు వాదనలు చేయలేకనే ఏజీ ప్రకాశ్‌ రెడ్డి రాజీనామా చేశారు’  అని రేవంత్‌ ఆరోపించారు

ఆంధ్ర ఉద్యోగులకు అందలాలు..
‘మెట్రోలో కేసీఆర్‌ అవినీతికి అనుకూలంగా ఉన్నందుకే ఆంధ్రకు చెందిన ఎన్వీఎస్‌ రెడ్డిని మెట్రోకు శాశ్వత ఎండీగా నియమించారు. కేసీఆర్‌ పాలనలో ఆంధ్ర ఉద్యోగులకు అందలమెక్కిస్తున్నారు. అట్టడగు వర్గాలకు చెందిన విద్యార్థులను ఎవరెస్టు ఎక్కించిన తెలంగాణ బిడ్డ ఐసీఎస్‌ ప్రవీణ్‌ కేసీఆర్‌కు కనబడరు. కేటీఆర్‌ సెక్యూరిటీ లేకుండా అసదుద్దీన్‌తో చర్చలు జరిపింది పాతబస్తీ మెట్రో తరలింపును ప్రశ్నించకుండా ఉండటానికే. పాతబస్తీలో రావాల్సిన మెట్రోని  రాయదుర్గంకు తరలిస్తున్నారు’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు