రేవంత్‌కు రాహుల్‌ గాంధీ ఏం చెప్పారంటే..

31 Oct, 2017 13:31 IST|Sakshi

కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన జాతీయ ఉపాధ్యక్షుడు

రేవంత్‌ సహా 18 మంది చేరిక.. దగ్గరుండి నడిపించిన ఉత్తమ్‌

సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ మాజీ నేత అనుముల రేవంత్‌ రెడ్డి సహా పలువురు కీలక నాయకులు మంగళవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. వీరికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతానికి రేవంత్‌ సహా 18 మంది నాయకులు హస్తం గూటికి చేరారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, నేతలు వి.హన్మంతరావు, గీతారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కుసుమ కుమారి, మల్లు రవి, చెన్నారెడ్డి, మధుయాష్కిగౌడ్‌, కుసుమ కుమారి తదితరులు కూడా చేరిక సమావేశంలో పాల్గొన్నారు.

రాహుల్‌ ఏం చెప్పారు? : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడి నివాసం నుంచి బయటికి వచ్చిన అనంతరం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. టీడీపీ నుంచి రేవంత్‌ రెడ్డి, సీతక్క, బోడ జనార్థన్‌, వేం నరేందర్‌రెడ్డి, అరికెలనర్సారెడ్డి, సోయం బాపురావు, కవ్వంపల్లి సత్యనారాయణ, సత్యం, జంగయ్య, హరిప్రియా నాయక్‌, బిల్యా నాయక్‌, శశికళ, రాజారాం యాదవ్‌, పటేల్‌ సుధాకర్‌రెడ్డి, రమేశ్‌​, విజయరమణా రావులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి దొమ్మాటి, విద్యార్థి, యువజన ఉద్యమనాయకులు దరువు ఎల్లన్న, బాలలక్ష్మి, మధుసూదన్‌లు కాంగ్రెస్‌లోకి చేరినట్లు తెలిపారు. ‘‘కాంగ్రస్‌ పార్టీకి పునర్‌వైభవం వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మీ అందరూ ఇప్పుడు కాంగ్రెస్‌ కుటుంబంలో సభ్యులయ్యారు. పదవుల విషయంలో సాధ్యమైనంత మేరలో  అందరికీ న్యాయం చేస్తా..’’ అని రాహుల్‌.. రేవంత్‌ బృందంతో అన్నట్లు ఉత్తమ్‌ వివరించారు.

మాట్లాడని రేవంత్‌ : పార్టీలో చేరిక అనంతరం మీడియా ముందుకొచ్చిన రేవంత్‌ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. నేటి మధ్యాహ్నం 3గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఉంటుందని, అక్కడ అన్ని విషయాలపైనా స్పందిస్తానన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరగాలని, అందులో భాగంగానే తాము కాంగ్రెస్‌లో చేరామని రాజారాం యాదవ్‌ చెప్పారు. టీడీపీని వీడటం గుండెకోత లాంటిదే అయినా కేసీఆర్‌ను గద్దెదింపడం కోసమే కాంగ్రెస్‌లోకి చేరానని అరికెల నర్సారెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు