రేవంత్‌ రెడ్డి ముందస్తు అరెస్ట్‌

4 Dec, 2018 06:32 IST|Sakshi

సాక్షి, కొడంగల్‌: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేశారు. ఈసీ ఆదేశాలతో మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు రేవంత్‌రెడ్డి నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నేడు కోస్గిలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బహిరంగ సభ దృష్య్టా రేవంత్‌ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు రేవంత్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీ పోలీసులను ఆదేశించింది.

అర్ధరాత్రి తొలుత రేవంత్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నామని ప్రకటించిన పోలీసులు.. ఆ తర్వాత తెల్లవారుజామున ఇంటి తలపులు పగులగొట్టి అరెస్ట్‌ చేశారు. రేవంత్‌తో పాటు ఆయన సోదరుడు కొండల్‌రెడ్డిని, ప్రధాన అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆనంతరం రేవంత్‌ను జడ్చర్ల ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించినట్టుగా తెలుస్తోంది. కోస్గి, కొడంగల్‌లో పోలీసులు 144 సెక్షన్‌ విధించడంతో పాటు భారీగా బలగాలను మోహరించారు. రేవంత్‌ అరెస్ట్‌తో కొడంగల్‌లో ఉద్రిక్తత నెలకొంది.

కాగా, పోలీసుల తీరుపై రేవంత్‌ భార్య గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అన్యాయానికి పరాకాష్ట అని అన్నారు. పోలీసులు తలుపు విరగగొట్టి ఇంటి లోపలకి వచ్చినట్టు తెలిపారు. ఇంట్లో ఉన్న వ్యక్తికి భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. తమ ఆత్మ గౌరవం మీద దెబ్బకొడితే ఊరుకోమని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు