ఓడితే రాజకీయ సన్యాసానికి సిద్ధమే

10 Dec, 2018 01:49 IST|Sakshi

కొడంగల్‌ ఎన్నికపై రేవంత్‌రెడ్డి సవాల్‌

నేను గెలిస్తే కేటీఆర్‌ రాజకీయ సన్యాసం తీసుకుంటారా? 

రెండుచోట్ల కేసీఆర్‌ ఓటు నమోదు చేసుకున్నారు... ఈసీ చర్యలకై డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కొడంగల్‌ నియోజకవర్గం నుంచి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. తాను గెలిస్తే రాజకీయాల నుంచి వైదొలిగే దమ్ము మంత్రి కె.తారకరామారావుకు ఉందా.. అని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. కేటీ రామారావు కనుక మాట మీద నిలబడకుంటే ఆయనది కల్వకుంట్ల వంశమేకాదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఇక్కడ తన నివాసంలో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొడంగల్‌ నుంచి తాను గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘నేను ఓడిపోతానని కేటీఆర్‌ చెప్పారు. నిజంగా ఆయన అన్నట్లు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. మరి నేను గెలిస్తే ఆయన రాజకీయ సన్యాసంతోపాటు ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణకు డిమాండ్‌ చేస్తారా. గడచిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ వందసీట్లు రాకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్‌ సవాల్‌ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 99 సీట్లు వచ్చాయి. అయినా, కేటీఆర్‌ మాట మీద నిలబడలేదు. కనీసం ఇప్పుడైనా మాట మీద ఉంటారా?’అని రేవంత్‌ ప్రశ్నించారు.  

రెండుచోట్ల ఓటు నమోదుపై చర్య తీసుకోవాలి 
సీఎం కేసీఆర్‌ రెండుచోట్ల ఓటు నమోదు చేసుకున్నారని, ఇది చట్టరీత్యా నేరమని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడకలో కేసీఆర్‌ పేరు ఓటర్ల జాబితాలో ఉంది. అదే పేరును అటు ఇటు మార్చి గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో చంద్రశేఖర్‌రావు కల్వకుంట్ల, తండ్రి రాఘవరావు అని ఓటర్ల జాబితాలో నమోదై ఉంది. ఇలా ఒకే వ్యక్తి రెండుచోట్ల ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడం 1950 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 31 ప్రకారం నేరం. ఒకే వ్యక్తి రెండుచోట్ల ఓటుహక్కు కలిగి ఉంటే డిక్లరేషన్‌ ఇవ్వాలి. లేనిపక్షంలో చట్టప్రకారం ఏడాది జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశముంటుంది. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలి. చట్టప్రకారం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలి. కేసీఆర్‌ పేరుతో రెండుచోట్ల ఓటర్ల జాబితాలో చోటు కల్పించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా’అని రేవంత్‌ చెప్పారు. 

కక్షపూరితంగానే ఓట్ల తొలగింపు
ఓటుహక్కు ఇవ్వకపోవడం ద్వారా 20 లక్షల మంది ఓటర్లకు అన్యాయం జరిగిందని రేవంత్‌ అన్నారు. ఈ విషయంపై క్షమించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ కోరగా,  కేటీఆర్‌ మాత్రం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించారని ఎన్నికల అధికారులకు అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని కోర్టుకు చెప్పిన ఈసీ, ఓటర్లకు మాత్రం ఓటు వేసే అవకాశం కల్పించలేదన్నారు. కక్షపూరిత విధానంతో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసే వాళ్ల వివరాలను బూత్‌లవారీగా గుర్తించి 50 నుంచి 200 ఓట్లు తొలగించారని రేవంత్‌ ఆరోపించారు. ఓటు హక్కు కల్పించడంలో విఫలమైన అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలన్నారు. 

మరిన్ని వార్తలు