ఓటుకు కోట్లు కేసు.. కేసీఆర్‌పై రేవంత్‌ విమర్శలు!

8 May, 2018 18:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావులు కలసి కుట్ర పన్నుతున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నేత రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కేసు వెలుగులోకి వచ్చిన రోజు కంటే ఇప్పుడే దీనికి అధిక ప్రాధాన్యం కల్పించి తమను భయపెట్టి, బెదిరించి, లొంగదీసుకోవాలని చూస్తున్నారని అన్నారు.

మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ రాష్ట్రంలో విస్తృతంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, నాలుగేళ్లలో కేసీఆర్‌ కుటుంబం వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించారు. కేసీఆర్‌ బంధువైనా, ఆయన సామాజికవర్గానికి చెందిన వ్యక్తైనా దర్జాగా సంపాదించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని మండిపడ్డారు.

లంచం అడిగితే చెప్పుతో కొట్టాలన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు కోట్ల రూపాయల అవినీతి సొమ్ముతో ఏసీబీకి చిక్కిన అధికారి సంజీవరావును ఇంకా పదవిలో ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ఏసీబీ, ముఖ్యమంత్రి వ్యవహార శైలి సరిగా లేదని అన్నారు. తెలంగాణ ఏసీబీ 2016లో 125 కేసులకు ఆధారాలు లేవంటూ వాటిని మూసేసిందని చెప్పారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో వెల్లడించిన నివేదికలో ఈ విషయం ఉందని తెలిపారు.

ఇప్పటివరకు ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏ–1గా ఉండగా, సెబాస్టియన్‌ ఏ–2గా, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏ–3గా, ఉదయ్‌సింహ ఏ–4గా, జెరూసలెం మత్తయ్య ఏ–5గా ఉన్నారు. అయితే ఇప్పుడు కుట్ర మొత్తం చంద్రబాబుదే అని స్పష్టం కావడంతో ఏ–1గా ఆయన పేరు చేర్చే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు