‘అసైన్డ్‌’ ఆర్డినెన్స్‌ వెనుక వేల కోట్ల స్కాం

13 Feb, 2018 02:44 IST|Sakshi

బంధువైన ‘మై హోం’ రామేశ్వర్‌రావు లబ్ధికే సీఎం దీన్ని తెస్తున్నారు

2 వేల ఎకరాల అసైన్డ్‌ భూముల బదిలీకే ఈ బాగోతమని ధ్వజం

బడ్జెట్‌ సమావేశాలకన్నా ముందే హడావుడిగా ఆర్డినెన్స్‌ ఎందుకని ప్రశ్న

మాట విననందుకే ఐఏఎస్‌ అధికారి బీఆర్‌ మీనా బదిలీ అని వ్యాఖ్య  

సాక్షి, హైదరాబాద్‌: అసైన్డ్‌ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న ఆర్డినెన్స్‌ వెనుక వేల కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉందని, చుట్టాలకు మేలు చేసేందుకే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దీన్ని తెస్తున్నారని కాంగ్రెస్‌ నేత, కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అసైన్డ్‌ భూములను అస్మదీయులకు దోచిపెట్టాలని, తన సమీప బంధువైన మైహోం సిమెంట్స్‌ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావుకు లబ్ధి చేకూర్చేందుకే ఈ బాగోతానికి సీఎం తెరలేపారని దుయ్యబట్టారు.

సోమవారం అసెంబ్లీ ఆవరణలో రేవంత్‌ విలేకరులతో మాట్లాడుతూ ఆర్డినెన్స్‌ విషయంలో ప్రభుత్వానికి సదుద్దేశమే ఉంటే ఈ నెలలోనే బడ్జెట్‌ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించకుండా, హడావుడిగా శాసనసభ, మండలిని ప్రొరోగ్‌ చేసి మరీ ఆర్డినెన్స్‌ను ఎందుకు తేవాల్సి వస్తోందని ప్రశ్నించారు. ఈ విషయంలో తాను సీఎం కేసీఆర్‌పైనే ఆరోపణలు చేస్తున్నానని, కావాలంటే తనపై కేసులు పెట్టుకోవచ్చన్నారు. సీఎం బినామీ అయిన రామేశ్వర్‌రావు, ఆయన బంధువులు శంషాబాద్, మహేశ్వరం మండలాల్లోని ముచ్చింతల, నాగారం, నాగిరెడ్డిపల్లి తదితర పది గ్రామాల్లో 4 వేల నుంచి 5 వేల ఎకరాల భూములను సేకరించారని, ఇందులో 1,500 నుంచి 2,000 ఎకరాల అసైన్డ్‌ భూములున్నాయని రేవంత్‌ ఆరోపించారు.

వేల ఎకరాలను రామేశ్వర్‌రావుకు బదిలీ చేయడానికి, సీఎం బంధువైన కలెక్టర్‌ ద్వారా కేసీఆర్‌ దోపిడీకి పాల్పడుతున్నారని, హెచ్‌ఎండీఏ పరిధిలోని భూముల విషయంలో సహాయ నిరాకరణ చేసినందుకే ఐఏఎస్‌ అధికారి బి.ఆర్‌.మీనాను ఉన్నపళంగా బదిలీ చేశారని ఆరోపించారు. నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ కుట్ర గురించి తెలియాలంటే ముచ్చింతల భూముల్లో ఏం జరిగిందో ఆ గ్రామస్తులను అడిగితే తెలుస్తుందని, నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ వెనుక ఈ భూముల చీకటి కోణం ఉందన్నారు.


ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి...
ప్రస్తుతం ప్రభుత్వం తేవాలనుకుంటున్న ఆర్డినెన్స్‌ 2007లోనే శాసనసభ ఆమోదం పొందిందని, అయితే న్యాయవా ది బొజ్జా తారకం కోర్టుకు వెళ్లడంతో దీని అమలు ఆగిందని రేవంత్‌ చెప్పారు. కేసీఆర్‌ నిజంగా పేదల మేలు కోసమే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్లయితే శాసనసభలో దీనిపై చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. రిజిస్ట్రేషన్ల చట్టం–1908 ప్రకారం అసైన్డ్‌ భూములను రిజిస్టర్‌ చేసినా చెల్లదని, అలాంటప్పుడు రామేశ్వర్‌రావు, ఆయన బంధువుల పేరిట చేసిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసి వెంటనే ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు.

భూ రికార్డుల ప్రక్షాళనలో తేలి న అసైన్డ్‌ భూముల వివరాలు, వాటి ఆక్రమణదారుల వివరాలను ప్రభుత్వం వెబ్‌సైట్‌లో పెట్టాలని కోరారు. మహేశ్వరం, శంషాబాద్‌ మండలాల్లో మై హోం గ్రూప్‌ అధీనంలో ఉన్న పది గ్రామాల భూముల వివరాలను బయటపెడతామని, విచారణాధికారిని నియమిస్తే ఈ విషయాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని రేవంత్‌ సవాల్‌ విసిరారు. తన ఆరోపణలకు ప్రభు త్వం సమాధానం చెప్పాలని, ఈ వ్యవహారంపై దీర్ఘకాలిక పోరాటం చేస్తానన్నారు. 

మరిన్ని వార్తలు