మోదీ జీతగాడు కేసీఆర్‌!

17 Sep, 2018 01:34 IST|Sakshi

బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుమ్మక్కయ్యాయి

టీఆర్‌ఎస్‌పై రేవంత్‌రెడ్డి ధ్వజం

సాక్షి, వనపర్తి: బీజేపీతో టీఆర్‌ఎస్‌ పార్టీ కుమ్మక్కు అయిందని, ఆ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం కారణంగానే తెలంగాణలో ముందస్తు ఎన్నికలొస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపిం చారు. తాజా మాజీ ఎమ్మెల్యే జిల్లెల చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో నిర్వహించిన ‘పెబ్బేరు పొలికేక.. ప్రజాగ్రహ’ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ జీతగాడు కేసీఆర్‌. వారిద్దరి మధ్య ఒప్పందం ఉంది.

అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరేలా వారిరువురు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రజలకు మేలు చేకూరుతుందని భావిస్తే.. కేసీఆర్‌ కుటుంబం లో మాత్రమే ఐదుగురికి పదవులు వచ్చాయి.. నేడు వారు అనుభవిస్తున్న ప్రతి పైసా తెలంగాణ ప్రజల సొత్తు. ప్రగతిభవన్‌లో పేదలకు ప్రవేశం లేదు.. కేవలం కమీషన్‌ ఏజెంట్లకు అడ్డాగా మారింది’ అని అన్నారు. లక్ష ఉద్యోగాల భర్తీపై స్పష్టమైన హామీ కావాలంటే కేసీఆర్‌ ఉద్యోగం ఊడగొట్టి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. 100 మంది ఎమ్మెల్యే మద్దతుండి 9 నెలల ముందే పాలన చేతకాక ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు.

నీ బతుకంతా పొత్తులు, ఎత్తులే!
‘నీ బతుకంతా పొత్తులు, ఎత్తుల మయమని, 2004 లో కాంగ్రెస్, 2009లో టీడీపీతో జతకట్టడం ద్వారానే టీఆర్‌ఎస్‌ బతికి బట్టకట్టిందన్న విషయం మరిచిపోవద్దు’ అని రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌ అరాచక పాలనను అంతమొందించేందుకు అన్ని పార్టీలను కలుపుకుని ముందుకుపోతామని చెప్పారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న కుటుంబ తెలంగాణ కూటమిని కూల్చడానికి ప్రజా తెలంగాణ కూటమిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కొల్లాపూర్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి బీరం హర్షవర్ధన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేనారెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు