‘సెన్సేషన్‌రైజ్‌’కు ఈసీ అనుమతి ఉందా?

28 Oct, 2018 03:52 IST|Sakshi

గచ్చిబౌలి స్టేడియాన్ని తాగుబోతుల అడ్డాగా మారుస్తారా? 

కేసీఆర్‌ బంధువులే డేటింగ్‌ క్లబ్లు పెట్టడం సిగ్గుచేటు

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలి స్టేడియంలో ‘సెన్సేషన్‌ రైజ్‌’పేరుతో ఈవెంట్‌ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి తీసుకున్నారా లేదా అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యమాలకు వేదికగా ఉండే తెలంగాణను తాగుబోతులు, వ్యసనపరుల రాష్ట్రంగా మార్చాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గోవా, ముంబై, బెంగళూరు, పుణేల్లో నిషేధించిన మ్యూజికల్‌ నైట్స్‌ను రాష్ట్రంలో నిర్వహించడం, కేటీఆర్‌ బావమరిది రాజ్‌పాకాల డేటింగ్‌ క్లబ్‌ల నిర్వహణే ఇందుకు నిదర్శనమన్నారు. హైదరాబాద్‌లో శనివారం విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు వేం నరేందర్‌రెడ్డి, విజయరమణారావు, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, తోటకూర జంగయ్య యాదవ్‌ తదితరులతో కలిసి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. క్రీడలను నిర్వహించాల్సిన స్టేడియంను తాగుబోతులకు అడ్డాగా మారుస్తున్నారని, మద్యం సరఫరా చేసే చోటుకు 21 సంవత్సరాల లోపు వారిని ఎలా అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ఈవెంట్‌కు రూ.5 లక్షల చొప్పున కూడా టికెట్లు విక్రయించారని, కానీ, ఆన్‌లైన్‌లో మాత్రం రూ. 3 వేల నుంచి రూ.10వేలుగా పేర్కొన్నారంటే జీఎస్టీని కూడా ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్‌ శాఖ కళ్లు మూసుకుని పనిచేస్తోందని, జీఎస్టీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

గత ఏడాది కూడా ఇలాగే.. 
గత ఏడాది కూడా రాజ్‌పాకాల ఇలాంటి ఈవెంట్లు నిర్వహించారని, ఇప్పుడు తెరవెనుక ఉండి కొత్త వ్యక్తులను రంగంలోకి తెచ్చారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గత ఏడాది నిర్వహించిన ఈవెంట్‌ను వీడియో రికార్డింగ్‌ చేయాలని కోర్టు ఆదేశించిందని, కానీ ఏడాదయినా ఆ రికార్డింగులను కోర్టుకు సమర్పించలేదన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తల పిల్లలున్నారని అప్పట్లో హల్‌చల్‌ చేశారని, ఏడాది గడిచినా దానిపై ఎందుకు నివేదిక ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇలాంటి ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లోనే అంతర్జాతీయ డ్రగ్‌ మాఫియాలు యువతను వ్యసనపరులను చేస్తున్నాయని అనేక పరిశోధనల్లో తేలిందన్నారు. ఇలాంటి ఈవెంట్లలోనే మోతాదు కన్నా డ్రగ్స్‌ ఎక్కువ తీసుకుని యువకులు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు.  

విచారణ జరపాలి 
ఇదే ఈవెంట్‌లో ఈవెంట్స్‌నౌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో రాజ్‌పాకాల డేటింగ్‌ పేరుతో ఒంటరి యువకులు, యువతులను మాట్లాడుకునే అవకాశం కల్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులే ఇంత నీచపనులకు పాల్పడుతుంటే రాష్ట్రంలో డ్రగ్స్‌ వినియోగాన్ని ప్రభుత్వం ఎలా నియంత్రిస్తుందని ప్రశ్నించారు. ఈ ఈవెంట్‌  ఏర్పాట్లపై టాస్క్‌ ఫోర్స్‌ పట్టించుకోవడం లేదని, సిట్‌ ఏం చేస్తుందని ఆయన నిలదీశారు. తక్షణమే పోలీస్, నిఘావర్గాలు, ఎన్నికల పర్యవేక్షణ అధికారులు జోక్యం చేసుకుని విచారణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం పూనుకోకపోతే కాంగ్రెస్‌ పార్టీగా తామే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఆయన హెచ్చరించారు.  

రేవంత్‌రెడ్డిపై రూ.100 కోట్ల పరువునష్టం దావా 
కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఈవెంట్స్‌ నౌ కంపెనీ ప్రకటించింది. రేవంత్‌ చేసిన ఆరోపణలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని లేకుంటే రూ.100 కోట్ల పరువునష్టం దావాకు ఆయన సిద్ధంగా ఉండాల ని శనివారం ప్రకటనలో తెలిపింది. రేవంత్‌ రెడ్డికి ఈ–కామర్స్‌ కంపెనీలు పని చేసే విధానంపై ఏ మాత్రం అవగాహన లేదని, మా కంపెనీపై ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని పేర్కొంది. సెన్సేషన్‌ కార్యక్రమానికి ఈవెంట్స్‌ నౌకి ఎలాంటి సంబంధం లేదని, ఆ కంపెనీ స్వయంగా ఎలాంటి ఈవెంట్స్‌ నిర్వహించదని అందులో వివరించింది.

మరిన్ని వార్తలు