కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి

15 Dec, 2019 03:09 IST|Sakshi
టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో, వారి సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, రైతు, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ ‘భారత్‌ బచావో’ఆందోళన శనివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించింది. తెలంగాణ నుంచి 4 వేల మంది నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘ప్రధాని మోదీ విభజించి పాలించు తరహాలో దేశంలో వ్యవస్థలను నాశనం చేశారు. ఆర్థిక మాంద్యం దేశాభివృద్ధిని తిరోగమనంలో తీసుకెళ్తోంది. శాంతి భద్రతలు కరువయ్యాయి, మహిళలకు రక్షణ లేకుండా పోయింది’అని విమర్శించారు. ‘సీఎం కేసీఆర్‌ నియంతృత్వ, రాచరిక పాలనలో తెలంగాణ రాష్ట్రం బందీ అయింది. కేసీఆర్‌ దోపిడీ ఆపేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మిగులు రాష్ట్రాన్ని బాకీల తెలంగాణగా మార్చారు.  రాష్ట్రం మాత్రం దివాలా తీసింది’అని ఆరోపించారు.

‘కేసీఆర్‌ సే తెలంగాణ బచావో’: జాతీయ స్థాయిలో ఏఐసీసీ ‘భారత్‌ బచావో’ఆందోళన స్ఫూర్తిగా తెలంగాణలో సైతం ప్రభుత్వ వైఫల్యాలపై ‘కేసీఆర్‌ సే తెలంగాణ బచావో’ఆందోళన నిర్వహించాలని టీపీసీసీ కోర్‌ కమిటీ ప్రాథమికంగా నిర్ణయించింది. శనివారం ఢిల్లీలో ‘భారత్‌ బచావో’ ఆందోళనకు వచ్చిన కోర్‌ కమిటీ నేతలు సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ‘భారత్‌ బచావో’సభకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, పొడెం వీరయ్య, పీసీసీ మాజీ అధ్యక్షులు వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ప్రజాప్రతినిధులు జానారెడ్డి, గీతారెడ్డి, సురేష్‌ షెట్కార్, సిరిసిల్ల రాజయ్య తదితరులు హాజరయ్యారు. ఏపీ నుంచి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, ఏపీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తదితరులు హాజరయ్యారు.

>
మరిన్ని వార్తలు