ప్రగతిభవన్‌లో అప్రకటిత కర్ఫ్యూ: రేవంత్‌

13 Oct, 2018 02:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రగతిభవన్‌లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విమర్శించారు. సహచర మంత్రులకు ప్రగతిభవన్‌లోకి ఎంట్రీ దొరకడం లేదని, వారిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బానిసలుగా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీనియర్‌ నేత అయిన నాయిని నర్సింహారెడ్డికి నెల రోజులుగా కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ లభించడం లేదంటేనే పరిస్థితి అర్థమవుతోందన్నారు.

మొదటి నుంచి టీఆర్‌ఎస్‌ వెన్నంటి ఉన్న నాయినికి నెల రోజులుగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదంటే అది అవమానం కాదా? అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో ఎల్బీనగర్‌లో పోటీ చేస్తే రూ.10 కోట్లు ఇస్తానని కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని నాయిని పత్రికాముఖంగా చెప్పారనీ, దీన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందువల్లే తనకు గిట్టని వారిపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌ కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.  

మరిన్ని వార్తలు