నేను పార్టీ మారను : రేవంత్‌ రెడ్డి

28 May, 2019 14:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తాను పార్టీ మారుతానని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద నమ్మకంతో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ టికెట్‌ ఇచ్చారని, తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. సోషల్ మీడియాలో వ్యాపారం కోసం ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డితో కలసి రేవంత్‌ మీడియాతో మాట్లాడారు.

దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం, మినీ భారతదేశంగా పిలువబడే మల్కాజిగిరిలో ప్రజలు తనని ఆశీర్వదించారన్నారు. కొడంగల్‌లో కేసీఆర్‌, హరీష్‌ రావు తనపై కుట్రలు చేసి ఓడించారని, కానీ ప్రశ్నించేవారు ఉండాలని రేవంత్‌ రెండ్డిని మల్కాజిగిరి ప్రజలు గెలిపించారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిలబెట్టుకుంటానని, వారికిచ్చిన హామీలను నెరవేరుస్తానన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ విభజన రాజకీయాలను తిప్పి కొడతామన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వల్ల గెలిచిన బీజేపీని పార్లమెంట్‌లో నిలువరించి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు.

మరిన్ని వార్తలు