సచివాలయం కూల్చివేతను అడ్డుకోండి

28 Jun, 2019 07:05 IST|Sakshi

హైకోర్టులో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి పిల్‌.. నేడు విచారించే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయం కూల్చివేత నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. ప్రస్తుత సచివాలయాన్ని కూల్చేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని కోరుతూ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందు లో సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, రహదారులు, భవ నాల శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్‌ అండ్‌ బీ చీఫ్‌ ఇంజనీర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. ప్రస్తుత సచివాలయ భవనానికి 50 నుంచి 70 ఏళ్ల పాటు మన్నిక సామర్థ్యం ఉందని, అయినా ప్రభుత్వం దీనిని కూల్చివేయాలని నిర్ణయించడం ప్రజాధనాన్ని, వనరులను వృథా చేయడమేనని రేవంత్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 2016లోనే సచివాలయాన్ని కూల్చివేసేందుకు ప్రభు త్వం ప్రయత్నించగా దీనిపై పిల్‌ దాఖలు చేసినప్పుడు, దాన్ని కూల్చివేయబోమని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చిందన్నారు.  

ప్రభుత్వం ధర్మకర్త మాత్రమే
ప్రజల ఆస్తులకు ప్రభుత్వం కేవలం ధర్మకర్త మాత్రమేనని, ఈ ఆస్తులను ఎలా పడితే అలా దుర్వినియోగం చేయడానికి వీల్లేదని రేవంత్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత భవనాన్ని కూల్చివేయకుండా దానిని ఇతర అవసరాలకు వాడుకోవచ్చని, సచివాలయం కోసం మరోచోట భవనాన్ని నిర్మించుకుంటే ఏ ఒక్కరికీ ఇబ్బంది ఉండదన్నారు.

మరిన్ని వార్తలు