పదవికి దూరంగా ఉండి నిజాయితీ నిరూపించుకోలేరా?

9 Jun, 2020 04:49 IST|Sakshi

కేటీఆర్‌ను ప్రశ్నించిన కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: జన్వాడలో మంత్రి కేటీఆర్‌కు భూములు లేవన్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని, ఆయనకు జన్వాడలోని రెండు చోట్ల భూములు ఉన్నాయని కాంగ్రెస్‌ ఎంపీ ఎ.రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆయన 2 నెలల పాటు మంత్రి పదవికి దూరంగా ఉండి తన నిజాయితీని నిలబెట్టుకోలేరా అని ప్రశ్నించారు. ఇంకా మాట్లాడుతూ... ‘ఆ గ్రామంలోని 301– 13 సర్వే నంబర్లలో భూములు లేవన్న కేటీఆర్‌ మాటలు అబద్ధం. ఆయనకు జన్వాడలో భూములు ఉన్నట్టు పోలీసులు కోర్టుకు నివేదిక ఇచ్చారు. తన భూముల గురించి కేటీఅరే ఎన్నికల అఫిడవిట్‌లో స్వయంగా పేర్కొన్నారు. జన్వాడ గ్రామంలో కేటీఆర్‌కి రెండు ప్రాంతాల్లో భూములు ఉన్నాయి’ అని ఆయన చెప్పారు.

సోమవారం గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. జన్వాడలో కేటీఆర్‌ నిబంధనలు ఉల్లం ఘించారని అన్నారు. అక్కడ ఉన్న ఫామ్‌హౌస్‌కు కేటీఆర్‌ యజమాని కాదని, దాన్ని లీజుకు మాత్రమే తీసుకున్నారని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అంటున్నారని, 301–313 సర్వే నంబర్ల వరకు తనకు ఎలాంటి భూములు లేవని కేటీఆర్‌ ట్విట్టర్‌లో చెప్పారని రేవంత్‌ గుర్తు చేశారు. 2019 మార్చి 7వ తేదీన 301 సర్వే నెంబర్‌లో రెండు ఎకరాలు కేటీఆర్‌–ఆయన భార్య పేరుమీద భూమి రిజిస్ట్రేషన్‌ అయిందని, 2018 ఎన్నికల అఫిడవిట్‌లో రూ.2కోట్ల విలువైన ఆస్తులు జన్వాడ అర్చనా వెంచర్స్‌ పేరు మీద ఉన్నట్టు స్వయంగా కేటీఆర్‌ తెలిపారని వెల్లడించారు.

అంగుళం స్థలంలో నిర్మాణం ఉన్నా కూల్చివేస్తా... 
తాను ఈ భూముల గురించి ఆరోపణలు చేస్తుంటే కేటీఆర్, సుమన్‌లు వేరే భూముల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఒట్టినాగులపల్లిలో తనకు 22 గుంటలు, తన బావమరిదికి 20 గుంటల భూమి ఉందని, ఈ భూమిలో అంగుళం స్థలంలో నిర్మాణం ఉన్నా తానే కూల్చివేస్తానని రేవంత్‌ చెప్పారు. కేటీఆర్‌ ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, ఆయన తన నిజాయతీని నిరూపించుకోవాలని కోరారు. తన ఆరోపణల్లో ఒక్క శాతం తప్పున్నా ఏ శిక్షకైనా సిద్ధమేనని రేవంత్‌ వ్యాఖ్యానించారు. సమావేశంలో మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి ప్రసాదకుమార్, డీసీసీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్, రామ్మోహన్‌ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, యూత్‌ కాంగ్రెస్‌ నేతలు అనిల్‌ యాదవ్, రవి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు