రేవంత్‌ రెడ్డిని చూస్తే ఆయన గుర్తుకొస్తున్నాడు

4 Mar, 2018 20:56 IST|Sakshi

వనపర్తి జిల్లా : కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై వనపర్తి ప్రజలు చూపిస్తున్న అభిమానం చూస్తుంటే..తనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకొస్తున్నారని మాజీ మంత్రి, వనపర్తి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి వచ్చినపుడు ప్రజలు ఆయనను చూసేందుకు వెంట పరిగేత్తేవారని వ్యాఖ్యానించారు. ఇపుడు రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గానికి వచ్చినా అలాంటి దృశ్యమే కనిపిస్తోందని చెప్పారు. వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సింహగర్జన కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా రేవంత్ రెడ్డి హజరయ్యారు.

ముందుగా ద్విచక్ర వాహనాలతో వనపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చిన్నారెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌కు అకస్మాత్తుగా ఢిల్లీపై ప్రేమ పుట్టిందన్నారు. ఎన్నికలు ఎపుడొచ్చినా వనపర్తిలో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి మాత్రం గెలవలేడన్నారు. రేవంత్‌ రెడ్డి లాంటి నాయకుడు ఉంటే..తన లాంటి నాయకుడికి తిరుగే ఉండదని వ్యాఖ్యానించారు. మా పార్టీ నాయకులను టీఆర్ఎస్ పార్టీలో చేరమని బలవంతంగా భయపెట్టి ఆ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. అలాంటి లుచ్చా రాజకీయం తాము చేయమన్నారు. కేసీఆర్‌ లాంటి నాయకుడిని ప్రధాన మంత్రి కానిద్దామా..తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని గెలిపిద్దామా అని సూటిగా అడిగారు.

 నీళ్లిచ్చామని టీఆర్‌ఎస్‌ నేతలు గొప్పలు చెబుతున్నారని, కానీ వాళ్లు ఎన్ని నీళ్లిచ్చినా ఆ నీళ్లలో కనిపించేది ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మేనని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉంటే వృధా అయిపోయేదని అన్నారు. తెలంగాణలో టీడీపీ లేకుండా చేసిన కేసీఆర్‌తోనే మళ్లీ ఇపుడు పొత్తుపెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కాంగ్రేస్ పార్టీలో చేరాతానంటే..కొంత మంది మా నాయకులు వద్దన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాతే కాంగ్రెస్‌ పార్టీకి ఇంత ఊపు వచ్చిందని వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి చేరకపోయుంటే కాంగ్రేస్ పార్టీకి ఇంత బలం ఉండేది కాదేమోనని జోస్యం చెప్పారు. రేవంత్ రాష్ట్ర, దేశ రాజకీయాలను ఉతికారేస్తాడని అన్నారు. రేవంత్ రాక సందర్భంగా వచ్చిన జనాన్ని చూసి తనకే ఆశ్చర్యమేస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2019లో రాహుల్ గాందీ ప్రధాన మంత్రి అవుతాడని, గత ఎన్నికల్లో తనపై పోటి చేసిన టీఆర్ఎస్ నాయకుడు నిరంజన్ రెడ్డి మళ్లీ తనపై గెలవలేడని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు