కాంగ్రెస్‌లో రేవంత్‌ కలకలం

10 May, 2018 01:54 IST|Sakshi

ఇదేం పద్ధతి అంటున్న సీనియర్లు 

పీసీసీ చీఫ్‌ను టార్గెట్‌ చేయడంపై విమర్శలు.. ఏఐసీసీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీ సీనియర్లంతా ఇదేం పద్ధతంటూ ఆయన్ను తప్పు పడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం క్రమశిక్షణా రాహిత్యమే అవుతుందని, ఆయనకు సలహాలిచ్చేవారు సరిగా లేరనడం పార్టీలోని నేతలందరినీ అవమానపర్చడమేనని వారంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిని టార్గెట్‌ చేయడం, సీఎం అవుతానని చెప్పడంపై విమర్శలు వస్తుండటంతో రేవంత్‌ శిబిరం కూడా గందరగోళంలో పడింది. 

అప్పుడే పదవులా?  
పార్టీలో చేరి ఆరు నెలలు కూడా కావడం లేదని, అప్పుడే పదవుల గురించి మీడియాతో మాట్లాడడం ఏంటని పలువురు నేతలు బాహాటంగానే రేవంత్‌పై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్లను కాదని సీఎం పదవి రేవంత్‌కు ఎలా ఇస్తారని, అయినా కలిసికట్టుగా పనిచేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాని గురించి ఆలోచించాలే తప్ప ఇప్పుడే ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. సీఎం పదవి కావాలంటే టీడీపీలోనే ఉంటే సరిపోయేదని, కాంగ్రెస్‌లోకి ఎందుకు వచ్చారంటున్నారు. ‘‘సోనియా గాంధీనే తెలంగాణ ఇచ్చినప్పటికీ సమన్వయ లోపం కారణంగా అధికారంలోకి రాలేకపోయాం. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి పార్టీయే. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు.

ఆయన పార్టీలోకి వచ్చింది కొద్దిరోజుల క్రితమే. పార్టీలో ఓపికగా ఎదురుచూడాలి. తనకు తాను నాయకుడిని అని చెప్పుకుంటే సరిపోదు. పార్టీ, ప్రజలు ఆయనను గుర్తించాలి. ప్రజల ఆశీర్వాదం కావాలంటే ప్రజాయజ్ఞం చేయాలి. పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి మంచి చేయవు’’అని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆయనతోపాటు పలువురు నేతలు కూడా అంతర్గతంగా రేవంత్‌ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. అనివార్య పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌లో చేరారంటున్నారు. ‘‘అసలు ఓటుకు కోట్లు కేసుకు, కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఆ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రేవంత్‌ ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు. అలాంటప్పుడు ఆ భారాన్ని మేం మోయాలి కదా? రేవంత్‌కు రక్షణగా ఉండాలి కదా? ఇవన్నీ ఆలోచించకుండా పార్టీని నష్టపరిచేలా మాట్లాడితే ఎలా’’అని టీపీసీసీకి చెందిన ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు. 

కుంతియా దృష్టికి.. 
బుధవారం శ్రీలంక నుంచి హైదరాబాద్‌కు వచ్చిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాను పలువురు రాష్ట్ర నేతలు కలిశారు. పార్టీలోని పలు అంశాలపై చర్చించారు. రేవంత్‌రెడ్డి పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా రేవంత్‌ను కట్టడి చేయాలని కోరినట్టు సమాచారం. తాను రేవంత్‌తో మాట్లాడతానని కుంతియా చెప్పినట్టు సమాచారం. రేవంత్‌ వ్యాఖ్యలను ఏఐసీసీ దృష్టికి కూడా తీసుకెళ్తామని పలువురు కాంగ్రెస్‌ నేతలంటున్నారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసే యోచనలో కొందరు నేతలున్నారు.  

మరిన్ని వార్తలు