కేసీఆర్‌పై రేవంత్‌ రెడ్డి ఫైర్‌

25 Aug, 2018 17:37 IST|Sakshi
రేవంత్‌ రెడ్డి, షబ్బీర్‌, కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కొడంగల్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..‘ సెప్టెంబర్‌ 2 న జరగబోయే కొంగరకలాన్‌ సభకు 25 లక్షల మందిని తరలించాలంటే 2.5 లక్షల వాహనాలు కావాలి..కనీసం నియోజకవర్గానికి 25 వేల మందిని తరలించాలి..25 లక్షల మందిని తేవాలంటే..రెండున్నర లక్షల వాహనాలు కావాలి. కొంగరకలాన్‌ సభకు రెండున్నర లక్షల మందికి మించి జనసమీకరణ చేయలేరు. 25 లక్షల మందిని తరలించడానికి ఉపయోగించే రెండున్నర లక్షల వాహనాలను ఎక్కడ పార్కింగ్‌ చేస్తారు. ఈ టెక్నికల్‌ వివరాలు విడుదల చేయాలి. సభకు ప్రజలను తరలించేందుకు ఒక్కో వాహనానికి సరాసరి కనీసం ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది. 25 లక్షల మందిని సభకు తరలించాలంటే..4 నుంచి 5 వందల కోట్లు ఖర్చవుతుంది. టీఆర్‌ఎస్‌ నాయకులకు గ్రామాల్లో మొఖం చెల్లక హైదరాబాద్‌లో సభ పెడుతున్నార’ ని వ్యాఖ్యానించారు.

నిన్న పంపిణీ చేసిన డబ్బాల్లో ప్రచార సామగ్రి లేదు..డబ్బులు పెట్టి పంపిణీ చేశారని ఆరోపించారు. ఒక్కో డబ్బాలో కోటి రూపాయలు పెట్టి పంపిణీ చేశారని అన్నారు. ఇంత జరుగుతుంటే నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.విచారణ సంస్థలు తక్షణమే ఆ సొమ్ముపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గన్‌మెన్‌లతో డబ్బాలు మోయించినందుకు ఆ ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టాలని అన్నారు. మా అధిష్టానం ఢిల్లీలో ఉంది...కేసీఆర్‌ అధిష్టానం మోదీ కూడా ఢిల్లీలోనే ఉన్నారని, టీఆర్‌ఎస్‌ బీజేపీకి అనుబంధ శాఖగా కొనసాగుతుందని విమర్శించారు.  కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ప్రశ్నించారు. కొత్తోళ్లకు టిక్కెట్లు ఇస్తే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఓడగొడతారు..సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తే ప్రజలు ఓడగొట్టే పరిస్థితి టీఆర్‌ఎస్‌లో ఉందన్నారు.

రెండు వేల కోట్లు కేసీఆర్‌కు ఎక్కడివి: షబ్బీర్‌ అలీ

ప్రజల సమస్యలు గాలికి వదిలేసి ముందస్తు ఎన్నికలు అంటూ కేసీఆర్‌ టైం పాస్‌ చేస్తున్నారని ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ మండిపడ్డారు. నిజామాబాద్‌ రైతులు నీళ్లు అడుగుతుంటే కేసీఆర్‌కు కనబడటం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహణకు ఒక్కొక్కరికి రూ. 10 కోట్లు ఇస్తామనడం ఎలక్షన్‌ రూల్స్‌కి విరుద్ధమన్నారు. రూ. రెండు వేల కోట్లు కేసీఆర్‌కు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ సుమోటోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. సీఎంగా కేసీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.ఎన్నికలంటే కాంగ్రెస్‌కు భయం లేదని, అర్ధరాత్రి పెట్టినా తాము ఎన్నికలకు రెడీ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు