కేసులకు అదరను.. దాడులకు బెదరను

10 Jun, 2019 08:18 IST|Sakshi
మల్కాజిగిరిలో నిర్వహించిన ర్యాలీ

ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాడతా

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను  

రాష్ట్రంలో కేసీఆర్‌ది రాచరిక పాలన  

మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ధ్వజం

మల్కాజిగిరి: ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం మల్కాజిగిరి బృందావన్‌ గార్డెన్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి నందికంటి శ్రీధర్‌ ఆధ్వర్యంలో ప్రజా కృతజ్ఞతా సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపించిన గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న మల్కాజిగిరికి ప్రాతినిధ్యం వహించడానికి వచ్చిన అవకాశాన్ని పెద్ద బాధ్యతగా భావిస్తున్నానన్నారు. కౌన్సిలర్‌ల నుంచి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి దాకా అందరూ ఒకే పార్టీ వాళ్లే ఉన్నప్పుడు మల్కాజిగిరి ప్రజలు ప్రశ్నించే గొంతు గురించి ఆలోచించి తనకు ఓటు వేశారన్నారు. కొట్లాడేటప్పుడు ప్రజలే తన పక్షాన ఉంటారన్నారు. నమ్మకాన్ని వమ్ము చేయనని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడతానన్నారు. కేసులకు భయపడేది లేదని, దాడులకు బెదిరేది లేదన్నారు.

వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఏకపక్షంగా బెదిరించి ఒకే గాడిన కట్టేస్తున్నారని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పాలన సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రజల కోసం అవసరమైతే ప్రధాన మంత్రిని కూడా నిలదీస్తానన్నారు. గ్రేటర్‌ ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం కావాలన్నారు. నాయకులు, కార్యకర్తలు బస్తీబాట పట్టాలని, కొత్త కమిటీలు వేసుకొని పనిచేయాలన్నారు. కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించాలని రేవంత్‌రెడ్డి సూచించారు. గ్రేటర్‌లో కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు గెలిపించుకునే బాధ్యత తనపై ఉందన్నారు. కేసీఆర్‌కు బలాన్ని ఇచ్చింది ప్రజలలేనని, ఆ బలాన్ని ఆయన దుర్వినియోగం చేస్తూ పాలన చేస్తున్నారు. మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఆయనకు వారిపై ఉన్న భావన తెలియజేస్తోందని చెప్పారు. సమస్యలపై ప్రజల గొంతునై ప్రశ్నిస్తానన్నారు. కార్యక్రమంలో కాం గ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్, నాయకులు జి.డి. శ్రీనివాస్‌గౌడ్, చంద్రశేఖర్, శ్రీనివాస్‌ గౌడ్, వెంకటేష్, లింగారెడ్డి, ఆంథోని, ఉమేష్‌సింగ్, వేణునాయుడు, చందు, శంకర్, రమేష్, సీపీఐ నాయకుడు బాలమల్లేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు