ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు: రేవంత్‌రెడ్డి

30 Mar, 2019 07:34 IST|Sakshi
బీఎన్‌రెడ్డినగర్‌లో రోడ్‌షోలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి

వనస్థలిపురం/హయత్‌నగర్‌: రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇతర పార్టీల్లో గెలిచిన వారిని టీఆర్‌ఎస్‌లో కలుపుకుంటున్నారని, కలవని వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, కడుపులో పేగులు తెగినా, తల తెగిపడ్డా ప్రజల కోసం పోరాడతానని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం హయత్‌నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్, కర్మన్‌ఘాట్‌ నందనవనం, చంపాపేటల్లో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తనకు పోటీగా నిలబడిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డికి మంత్రి మల్లారెడ్డి అల్లుడనే అర్హత  తప్ప ఎప్పుడూ ప్రజా సమస్యలను పట్టించకోలేదన్నారు.

వారి కుటుంబం పేదలకు ఏనాడైనా సహాయం చేసిందా? ఏ పేద వాడికైనా తమ కళాశాలలో ఫీజులు తగ్గించారా అని ప్రశ్నించారు. ఆయన గెలిస్తే తన వ్యాపారాలు తాను చేసుకుంటాడు తప్పా ప్రజల సమస్యలను పార్లమెంటులో వినిపించే ప్రసక్తి లేదన్నారు. బీజేపీ అభ్యర్థి శాసన మండలి సభ్యుడిగా ఉండి ఏనాడు ప్రజా సమస్యలు పట్టించకోలేదని, ఒక్కరూపాయి నిధులు తెచ్చిన దాఖలాలు లేవన్నారు. గత ఎన్నికల్లో ఎల్‌బీనగర్‌ నుంచి సుధీర్‌ అన్నను గెలిపించుకోవడానికి సుడిగాలి పర్యటన చేశానని, తనను పార్లమెంట్‌ ఎన్నికల్లో నిలబడాలని చెప్పి ఆయన పార్టీ మారడం ఎంతవరకు సమంజసమని అన్నారు. బీఎన్‌రెడ్డినగర్‌లో నిలచిపోయిన 5 వేల కుటుంబాలు ఇళ్ల రిజిస్ట్రేషన్‌ సమస్యను పరిష్కరించడానికే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని చెపుతున్న సుధీర్‌రెడ్డి ఇపుడు ఆ సమస్యను పరిష్కరించి చూపాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పలు సమస్యలపై పోరాడిన చరిత్ర తనకు ఉందని, ప్రజల గొంతు పార్లమెంట్‌లో వినిపించాలంటే తనను ఎంపీగా గెలిపించాలని అన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగ సమస్య పరిష్కారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విఫలమయ్యారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అద్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, టీడీపి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, నాయకులు జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి, సామ రాంమోహన్‌రెడ్డి, గుర్రం శ్రీనివాస్‌రెడ్డి, మకుటం సదాశివుడు, గజ్జి భాస్కర్, కొత్తపల్లి జైపాల్‌రెడ్డి, సామ ప్రభాకర్‌రెడ్డి, విజయ్‌కుమార్, నూతి శ్రీనివాస్, శ్రీరామ్, శ్రీకాంత్‌ ముదిరాజ్, సునీల్, లింగం మనోజ్, అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు