అటు పట్టణ ప్రగతి... ఇటు పట్నం గోస

24 Feb, 2020 01:47 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి ప్రతిగా కాంగ్రెస్‌ రూపకల్పన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు పట్టణ ప్రగతి పేరుతో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమానికి రూపకల్పన చేయగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ ‘పట్నం గోస’పేరుతో మరో కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ పక్షాన పట్టణ ప్రగతి ప్రారంభమవుతున్న సోమవారం నుంచే మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణమే ప్రధాన ఎజెండాగా చేసుకుని ఆయన క్షేత్రస్థాయికి వెళ్లబోతున్నారు.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోజుకో సెగ్మెంట్‌ వంతున ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించడం, లబ్ధిదారులతో సమావేశం కావడం, పనుల పురోగతి, నిర్మాణ పనుల ప్రారంభంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరపడ మే ఈ కార్యక్రమ ఎజెండా అని రేవంత్‌ కార్యాలయ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల సభ్యు లు, నియోజకవర్గాల్లోని పార్టీ సీనియర్‌ నేతలు పాల్గొంటారని పేర్కొన్నాయి.  

హామీలు నెరవేర్చలేదు: రేవంత్‌రెడ్డి 
2014, 2018 ఎన్నికల్లో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన అధికార టీఆర్‌ఎస్‌ ఆ హామీని నెరవేర్చలేదని ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ను మురికివాడల రహితం చేస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు పలుమార్లు చెప్పారని, కానీ వాస్తవంలో అది కార్యరూపం దాల్చలేదని ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు.  

మరిన్ని వార్తలు