హోదాపై టీఆర్‌ఎస్‌ వాదన చెప్పాలి

26 Jul, 2018 04:47 IST|Sakshi

రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో లోక్‌సభ వేదికగా టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత సమర్థిస్తే, మరో ఎంపీ వినోద్, మంత్రి హరీశ్‌రావులు వ్యతిరేకిస్తున్నారని, ఇందులో ఎవరిది టీఆర్‌ఎస్‌ అభిప్రాయమో చెప్పాలని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ముంపు గ్రామాల విలీనంపై రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన చర్చలో టీఆర్‌ఎస్‌ తరఫున కేసీఆర్, కేకేలు కూడా ఉన్నారని, ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీని నిందిస్తూ టీఆర్‌ఎస్‌ నేత లు మాట్లాడటం సమంజసం కాదన్నారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ ప్రధానిగా, కేసీఆర్‌ సీఎంగా వచ్చిన తర్వాతే ముంపు గ్రామాల విలీనం జరిగిందని గుర్తు చేశారు. హోదాపై కాంగ్రెస్‌ పార్టీ పూటకో మాట మార్చే పరిస్థితి ఉండదని, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో చేసిన ప్రత్యేక హోదా తీర్మానమే ఫైనల్‌ అని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విభజన బిల్లు పాస్‌ చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు.  తనపై ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్‌ దోపిడీని ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు