విద్యుత్‌పై చర్చకు సిద్ధం

30 Nov, 2018 02:24 IST|Sakshi

నాది తప్పని తేలితే ముక్కు నేలకు రాస్తా..  

నీది తప్పయితే సగం ముక్కు కోస్తా.. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌ 

కమీషన్లకు కక్కుర్తిపడే 24 గంటల విద్యుత్‌ సరఫరా 

కేసీఆర్‌ దిక్కుమాలిన దరిద్రుడు.. నల్లత్రాచుపాము వంటి వాడని ధ్వజం

సాక్షి, మహబూబాబాద్‌/ వరంగల్‌ రూరల్‌: విద్యుత్‌ కొనుగోలుపై చర్చకు తాము సిద్ధమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఈ విషయమై తన వాదన తప్పని తేలితే ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్‌ సగం ముక్కు కోస్తానని చెప్పారు. ‘‘మానుకోట సాక్షిగా సవాలు విసురుతున్నా.. దమ్ముంటే కేసీఆర్, ఆయన అనుచరులెవరైనా చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్‌లో, వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. కేసీఆర్‌ కమీషన్లకు కక్కుర్తిపడి అదనంగా విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారని, వాస్తవాలు బయటపెట్టడానికి తాను చర్చకు సిద్ధమన్నారు.

2004లోనే ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అప్పటి ప్ర«ధాని మన్మోహన్‌సింగ్‌ అనుమతులు ఇచ్చారని.. దాని వల్లే ఉత్పత్తి ఎక్కువైందని, వినియోగం తగ్గిందన్నారు. 24 గంటల విద్యుత్‌ అవసరం లేకున్నా.. కేవలం కమీషన్ల కోసమే సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వ్యతిరేకి లగడపాటి రాజగోపాల్‌తో, ఆంధ్రా కాంట్రాక్టర్లతో చేతులు కలిపి కమీషన్లు దండుకుంటున్న దరిద్రుడు కేసీఆర్‌ అని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ ఓడిపోతే విద్యుత్‌ సక్రమంగా రాదని.. చంద్రబాబు పెత్తనం ఉంటుందని.. ప్రతి విషయానికీ ఢిల్లీ వెళ్లాల్సి వస్తుందని కేసీఆర్‌ ప్రజలను తప్పుదోవ పట్టించి భయపెడుతున్నారని చెప్పారు.   కేసీఆర్‌ నల్ల త్రాచుపాములాంటోడని విమర్శించారు. పుట్టలో నుంచి వచ్చిన పాము మళ్లీ పుట్టలోకే పోతుందని (ఫాంహౌజ్‌) ఆ విషపు నాగును ప్రజలు పడగపై కొట్టి చంపాలన్నారు. 

మూడో కన్ను తెరుస్తావా?
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణలో అడుగుపెడితో మూడో కన్ను తెరుస్తానని కేసీఆర్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఫాంహౌజ్‌లో కూర్చొని 14 పెగ్గులు తాగితే ఉన్న కళ్లు కూడా మూసుకుపోతాయని.. అలాంటి వ్యక్తి మూడో కన్ను గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.  

మరిన్ని వార్తలు