టీఆర్‌ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు!

28 Aug, 2018 16:28 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌/సిరిసిల్లా : ఓ వైపు తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు సిద్దం అవుతుండగా.. మరోవైపు ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సీనియర్‌ నేతల సమక్షంలోనే పార్టీ నాయకులు వాదులాడుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మంగళవారం కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్‌, ఎంపీ వినోద్‌ కూమార్‌ ముందే ఎమ్మెల్యే శోభ, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ భర్త చుక్కారెడ్డిలు వాగ్వాదానికి దిగారు. ఫైర్‌ స్టేషన్‌ భవన ప్రారంభోత్సవం వద్ద చుక్కారెడ్డి టెంకాయ కొడుతుండగా ఎమ్మెల్యే శోభ అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్యే తమ అనచరులతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని మంత్రితో చుక్కారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.
 
ఎమ్మెల్యే రమేశ్‌కు వ్యతిరేకంగా..
రాజన్న సిరిసిల్లా జిల్లాలో వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌ బాబు వ్యతిరేక వర్గం వెయ్యి మంది కార్యకర్తలతో సమావేశమైంది. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే రమేశ్‌ బాబు స్వచ్చందంగా వైదొలగాలని డిమాండ్‌ చేశారు. వేములవాడలో పార్టీ నాయకత్వం మార్పు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చకుంటే భవిష్యత్తు కార్యచరణ రూపొందిస్తామని వారు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు