అఖిలేష్‌పై సీబీఐ దాడులు సమంజసమా!

7 Jan, 2019 16:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కు సంబంధించిన అక్రమ మైనింగ్‌ కేసులో శనివారం నాడు యూపీ, ఢిల్లీ, తెలంగాణలోని 14 ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించిన విషయం తెల్సిందే. 2012 నుంచి 2017 మధ్య సమాజ్‌వాది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అఖిలేష్‌ యాదవ్, మాజీ మంత్రి గాయత్రీ ప్రసాద్‌ ప్రజాపతి గనుల శాఖను నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అప్పటి ఐఏఎస్‌ అధికారి చంద్రకళ ఇంటిపై కూడా సీబీఐ దాడులు జరిగాయి. 2016లో అలహాబాద్‌ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను పునస్కరించుకొని ఈ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. 

2019 సార్వత్రిక ఎన్నికల్లో కలసికట్టుగా పోటీ చేస్తామంటూ ఎస్పీ, బీఎస్పీ నాయకులు అఖిలేష్‌ యాదవ్, మాయావతిలు సంయుక్త ప్రకటన చేసిన రోజే ఈ దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లయితే సీబీఐ దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ అధిష్టానం హెచ్చరించడం వల్లనే ఆ పార్టీతో మాయావతి పొత్తు పెట్టుకోలేదనే వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. 1963లో సీబీఐని ఏర్పాటు చేసిన నాటి నుంచి అది పాలకపక్ష పార్టీ తొత్తుగానే దుర్వినియోగం అవుతోంది. సీబీఐ దుర్వినియోగం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో 1997లో దాన్ని కేంద్రం ఇంటెలిజెన్స్‌ కమిషన్‌ పరిధిలోకి తీసుకొస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 

అందుకనే సీబీఐ ‘యజమాని మాటలు పలికే పంజరంలో రామచిలక’ అని 2013లో సుప్రీం కోర్టే స్వయంగా వ్యాఖ్యానించింది. 2018లో సీబీఐలో చోటుచేసుకున్న అంతర్గత పరిణామాలే పాలకపక్ష రాజకీయ జోక్యానికి అద్దం పడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడైన సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ అస్థానపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన కార్యాలయంపై స్వయంగా అప్పటి సీబీఐ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా ఆధ్వర్యాన దాడులు జరిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి అర్ధరాత్రి రంజిత్‌ సిన్హా కార్యాలయాన్ని సీల్‌ చేయించి ఆయన్ని బలవంతపు సెలవుపై పంపించింది. ఈ పరిణామాలన్నీ కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మనే విషయాన్నే రుజువు చేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు