లైవ్‌ అప్‌ డేట్స్‌.. అనూహ్యంగా స్వరం మార్చిన అన్నాడీఎంకే నేతలు

26 Dec, 2017 12:30 IST|Sakshi

సాక్షి, చెన్నై : ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో అన్నాడీఎంకే స్వతంత్ర్య అభ్యర్థి టీటీవీ దినకరన్‌ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. రౌండ్‌ రౌండ్‌ కి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తున్నాడు. అన్నాడీఎంకే,  డీఎంకే అభ్యర్థులకు పోలైన ఓట్లు మొత్తం కలిపినా ఆయన కంటే చాలా తక్కువ నమోదు కావటం విశేషం. 

దినకరన్‌ గెలుపు ఖాయమైపోతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు ఒక్కోక్కరుగా స్వరం మారుస్తున్నారు. ఆ పార్టీ నేత సెల్లూరు రాజు మీడియాతో మాట్లాడుతూ దినకరన్‌ గెలుపును స్వాగతించటం విశేషం. దినకరన్‌ తో కలిసి పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అపార్థాల వల్లే రెండుగా విడిపోయింది. త్వరలో రెండూ ఒకటవుతాయని ఆశిస్తున్నా.. ఆ మేర నా వంతు ప్రయత్నం చేస్తా అని ఆయన తెలిపారు. అదే అభిప్రాయాన్ని మరికొందరు నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం దినకరన్‌ ఇంటి వద్ద పండగ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే పగ్గాలు దినకరన్‌కు అప్పగించే సమయం వచ్చిందంటూ ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తూ రోడ్లపైకి చేరారు. ఫలితాలపై స్పందించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సుముఖత వ్యక్తం  చేయటం లేదు.

అయితే బీజేపీ మాత్రం మరో వాదనను వినిపిస్తోంది. ఓటుకు నోటు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని.. డబ్బు విచ్చలవిడిగా పంచటంతోనే దినకరన్‌ గెలుస్తున్నాడంటూ తమిళనాడు బీజేపీ చీఫ్‌ వ్యాఖ్యలు చేశారు. 

సుబ్రమణియన్‌ స్వామి ట్వీట్‌... 

ఇక బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్‌ స్వామి తన ట్విట్టర్‌ లో ఆసక్తికర సందేశం ఉంచారు. ఉప ఎన్నికలో దినకరన్‌ గెలుస్తాడనిపిస్తోందంటూ పేర్కొన్నాడు. 2019 ఎన్నికల కోసం అన్నాడీఎంకే వర్గాలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నాడు. కాగా, మధ్యాహ్నానికల్లా పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉంది. 

Liveblog

మరిన్ని వార్తలు